చిట్యాల్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్‌ | - | Sakshi
Sakshi News home page

చిట్యాల్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్‌

Aug 11 2026 11:52 PM | Updated on Aug 11 2026 11:52 PM

● వీడీసీ ఆధ్వర్యంలో గ్రామస్తుల నిర్ణయం ● ఆదర్శంగా తీసుకోవాలని డీఆర్డీవో సూచన

నిర్మల్‌ రూరల్‌: మండలంలోని చిట్యాల్‌ గ్రామ ప్రజలు ఆదర్శ నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామంలో ప్లాస్టిక్‌ను నిషేధించారు. ఇక నుంచి స్టీల్‌ డబ్బాలు, జూట్‌ బ్యాగులు, స్టీల్‌ వాటర్‌ బాటిళ్లను వాడుతామని ప్రకటించారు. గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా అధికారులు హాజరై గ్రామస్తుల నిర్ణయాన్ని అభినందించారు. డీఆర్డీవో విజయలక్ష్మి మాట్లాడుతూ.. గతంలో మార్కెట్‌కి వెళ్లినప్పుడు జూట్‌ బ్యాగులు తీసుకెళ్లే వారని.. ప్రస్తుతం అంతా ప్లాస్టిక్‌ మయం అయిందన్నారు. ప్లాస్టిక్‌ నిషేధించాలని గ్రామస్తులంతా కలిసి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. ఈ విధానాన్ని గ్రామంలో ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. ప్లాస్టిక్‌ నిషేధంపై గ్రామంలో ప్రతీ ఇంట్లో చర్చ జరగాలని సూచించారు. ఇతర గ్రామాల ప్రజలు చిట్యాల్‌ను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రముఖ సైకాలజిస్ట్‌ డాక్టర్‌ సురేశ్‌ మాట్లాడుతూ.. ప్లాస్టిక్‌ నిషేధాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలన్నారు. యువత మత్తు పదార్థాలు, వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఆర్డీవో రాందాస్‌ మాట్లాడుతూ.. ప్లాస్టిక్‌తో క్యాన్సర్‌ భూతం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌ నిషేధించాలని సూచించారు. డీఎంహెచ్‌వో రాజేందర్‌ మాట్లాడుతూ.. ప్లాస్టిక్‌ వినియోగం రోజురోజుకు పెరుగుతోందని, దీనివల్ల క్యాన్సర్‌ మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. సర్పంచ్‌ ఏనుగు సుప్రియ మాట్లాడుతూ.. గ్రామంలో ప్లాస్టిక్‌ నిషేధించడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. గ్రామస్తులు, వీడిసి, యువత సహకారంతో స్టీల్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతీ ఇంటికి ఒక వాటర్‌ బాటిల్‌, జూట్‌ బ్యాగు, టిఫిన్‌ డబ్బా ఉచితంగా అందిస్తామని వెల్లడించారు. అంతకుముందు విద్యార్థులు, గ్రామస్తులు ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటారు. డీఏవో అంజిప్రసాద్‌, తహసీల్దార్‌ ప్రభాకర్‌, ఎంపీడీవో సుధాకర్‌, ఎంఈవో విజయస్వప్న, ఎంపీవో శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement