నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా సెన్సెస్ హ్యాండ్ బుక్ రూపకల్పనకు శాఖల వారీగా సమాచారం అందించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సెన్సెస్ హ్యాండ్ బుక్ రూపకల్పనపై సంబంధిత అధికారులతో కలెక్టర్ మంగళవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలోని జనాభా, అక్షరాస్యత, భౌగోళిక పరిస్థితులు, విద్య, వైద్యం, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, వివిధ ప్రభుత్వ శాఖల వారీగా లభ్యమయ్యే సమాచారాన్ని అత్యంత కచ్చితత్వంతో సేకరించాలన్నారు. భవిష్యత్తులో జిల్లా సమగ్ర అభివృద్ధికి, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థవంతంగా అమలుకు, భౌగోళిక, సాంస్కృతిక అంశాల్లో అభివృద్ధికి ఈ సెన్సస్ హ్యాండ్ బుక్ ప్రామాణికంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రణాళిక, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్య, వైద్యారోగ్య శాఖల అధికారులు సమన్వయంతో నిర్ణీత గడువులోగా నివేదికలు సమర్పించాలని పేర్కొన్నారు. సేకరించిన సమాచారాన్ని క్షేత్రస్థాయిలో పునఃపరిశీలించిన తర్వాతే నివేదికలో పొందుపరచాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, సీపీవో గంగారెడ్డి, ఆర్డీవో దేవీదాస్, అధికారులు పాల్గొన్నారు.


