నిర్మల్‌టౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావా ల్సిన పీఆర్సీ ఇప్పటివరకు ప్రకటించకపోవడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దర్శనం దేవేందర్, గడ్డం భూమన్న అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పీఆర్సీని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్‌లో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులకు రావాల్సిన ఆరు డీఏలను వెంటనే ప్రకటించాలని, సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పదోన్నతులతో కూడిన బదిలీలు చేపట్టాలని కోరారు. మోడల్ స్కూల్ ఉద్యోగులకు 101 పద్దు కింద వేతనాలు చెల్లించాలని, కేజీబీవీ ఉద్యోగులు, గిరిజన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలన్నారు. టీఆర్టీఎఫ్ గౌరవాధ్యక్షుడు ప్రశాంత్, జిల్లా నాయకులు రవికిరణ్, పెంట పవన్, భోజన్న పాల్గొన్నారు.


