న్యూస్‌రీల్
సర్ డిజిటలైజేషన్ త్వరగా పూర్తి చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: సర్ డిజిటలైజేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాదు నుంచి సోమవారం సమీక్ష నిర్వహించారు.డిజిటలైజేషన్ ప్రక్రియ మొత్తాన్ని పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. ఎటువంటి తప్పులు దొర్లకుండా డిజిటలైజేషన్ చేపట్టాలన్నారు. ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియలపై జిల్లాల వారీగా సమీక్షించారు. ఒకే కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓటు ఉంటే, వారిని ఒకే పోలింగ్ కేంద్రం కిందకు వచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ వీసీలో కలెక్టర్ భవేశ్‌మిశ్రా, అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డీఆర్‌వో రాథోడ్ రమేశ్, ఆర్డీవో దేవీదాస్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్: ఎప్పుడు వస్తున్నారో.. ఎలా వస్తున్నారో తెలియడం లేదు. జిల్లాలో దొంగతనాలు చేస్తూ.. అందినకాడికి దోచుకుంటూ.. సరిహద్దు దాటి పారిపోతున్నారు. జిల్లాలో ఇటీవల వరుస చోరీలతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఒక కేసు ఛేదించేలోపే మరో దొంగతనం చేస్తున్నారు. ప్రధానంగా భద్రత లేని ఆలయాలను, చోరీ చేసి పారిపోవడానికి సులువుగా ఉండే ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. బాసర ఆలయం నుంచి జిల్లాకేంద్రంలోని మల్ల న్నగుట్ట హరిహరక్షేత్రం వరకు చిన్నపెద్ద అనే తేడా లేకుండా గుడుల్లో దోపిడీలకు తెగబడుతున్నారు. వరుస ఘటనల నేపథ్యంలో ఆలయాల భద్రతపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వరుస చోరీల వెనుక మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర ముఠాలు ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. రాత్రిళ్లు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ఎస్పీ జానకీషర్మిల ఆదేశించారు.
సరిహద్దు ఆసరాగా..
జిల్లా మహారాష్ట్ర సరిహద్దును ఆనుకుని ఉండటంతో అక్కడి నుంచి వచ్చే దొంగల ముఠాలు రాత్రివేళల్లో జిల్లాలోకి ప్రవేశించి చోరీలకు పాల్పడి, తెల్లవారే సరికి మహారాష్ట్రలోని దూరప్రాంతాలకు పారిపోతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. గతంలో నమోదైన కొన్ని కేసుల తీరు, సీసీటీవీ ఫుటేజీల్లో కనిపించిన అనుమానితుల కదలికలను పరిశీలిస్తూ ఈ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జిల్లా సరిహద్దు మార్గాలపైనా నిఘా పెంచారు. అనుమానితుల కదలికలను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆలయాలే లక్ష్యంగా..
ఇటీవల జిల్లాలోని పలు ఆలయాల్లో హుండీలు పగులగొట్టి నగదు అపహరించిన ఘటనలు పెరుగుతున్నాయి. ఇందులో ఒక కేసు గుట్టు విప్పేలోపే మరోచోట దొంగతనం జరగడంతో పోలీసులపైనా ఒత్తిడి పెరుగుతోంది. బాసర ఆలయంలో చోరీ కేసులో దొంగలను పట్టుకోగానే.. వేరే ముఠాలు మరో రెండు ఆలయాల్లో దొంగతనాలకు పాల్ప డ్డాయి. తాజాగా జిల్లాకేంద్రంలోని మల్లన్నగుట్ట ఆలయాల్లోనూ దోపిడీ చేయడం భక్తులను కలవరపెడుతోంది. రాత్రివేళల్లో జనసంచారం తక్కువగా ఉండే సమయాలను ఎంచుకుని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు.
జిల్లా కేంద్రంలోని మల్లన్నగుట్టలో ఫింగర్‌ప్రింట్స్ పరిశీలిస్తున్న పోలీసు సిబ్బంది
జిల్లాలో వరుస చోరీలు పోలీసులకు సవాల్‌గా మారాయి. వీటిని ఎస్పీ జానకీషర్మిల ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి సీసీటీవీ ఫుటేజీలు, సెల్‌ఫోన్ సిగ్నళ్లు, అనుమానితుల కదలికలపై ఆరా తీస్తున్నారు. చోరీలు జరిగిన వెంటవెంటనే ఆ కేసులను పరిష్కరించేలా, సంబంధిత దొంగలను పట్టుకునేలా టీమ్‌లు ఏర్పాటు చేసి పంపిస్తున్నారు. ఈ ఏడాది ఆరు నెలల్లోనే జిల్లాలో 230 చోరీ జరగడం గమనార్హం. వీటిలో 143 కేసులను ఛేదించారు.
చోరీలను అరికట్టేలా చర్యలు..
జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాలను పట్టుకునేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. సరిహద్దుల్లో ప్రత్యేకంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశాం. రాత్రిళ్లు పెట్రోలింగ్ మరింత పెంచాలని ఆదేశాలు జారీ చేశాం. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలి. –జానకీషర్మిల, ఎస్పీ


