లక్ష్మణచాంద: ప్రభుత్వ బడుల్లో గత సంవత్సరం ఉ న్న తీరు వేరు, ఇప్పటి తీరు వేరు. ఉపాధ్యాయులు పాఠశాలలకు గైర్హాజరైనా, మధ్యాహ్న భోజనంలో ఎటువంటి అవకతవకలకు పాల్పడినా, అలాగే పా ఠశాలలో చేపట్టే అభివృద్ధి పనుల్లో ఎటువంటి తేడా వచ్చినా వెంటనే గుర్తు పట్టేస్తుంది టీజీ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్. ప్రభుత్వ పాఠశాలల మొత్తం సమాచారాన్ని తెలుసుకునేందుకు తెలంగాణ విద్యాశాఖ ఈ నూతన యాప్‌ను అభివృద్ధి చేసింది.
పారదర్శకంగా సేవలు
రాష్ట్ర విద్యాశాఖ నూతనంగా తీసుకొచ్చిన ఈ యా ప్‌తో పాఠశాలల్లో విద్యా సేవల్లో మరింత పారదర్శకత ఏర్పడనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థు ల అభ్యసన సామర్థ్యాల స్థాయిని తెలుసుకోవచ్చు. మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరు, విద్యార్థులకు అందజేసే ఏకరూప దుస్తుల వివరాలు, పోషకుల సమావేశాల వివరాలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు తెలుసుకునే అవకాశం ఉంది. ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య పారదర్శకత పెంచడం ఈ యాప్ ప్రధాన లక్ష్యం. వివరాలనీ డిజిటలైజ్ చేయడానికి ఈ నూతన వాట్సాప్‌ను ఉపయోగిస్తుండటంతో ఈ యాప్ ద్వారా పాఠశాలల సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు.
15 రకాల సేవలు..
ఈ యాప్ ద్వారా విద్యార్థుల ఎఫ్‌ఎల్‌ఎన్, ఎల్‌ఐపీ(లిప్), బేస్‌లైన్ అసెస్‌మెంట్ ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థుల నైపుణ్యాలను పరిశీలిస్తారు. అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం నైపుణ్యాలను అంచనా వేస్తారు. బడిబాట ప్రవేశాలు, విద్యార్థుల ప్రొఫైల్ సృష్టించడం, అప్‌డేట్ చేయవచ్చు. మండల, జిల్లాస్థాయి అధికారులకు విద్యా ప్రగతి నివేదికలను నేరుగా అందిస్తోంది. విద్యార్థుల మార్కులు, మెమోలు, హాల్‌టికెట్లు, బోనఫైడ్స్, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు (టీసీ) వాట్సాప్‌లో డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. పరీక్షల సమాచారం, ఉపకార వేతనాలు, విద్యా సామగ్రి పంపిణీ వివరాలు మొబైల్‌కు సమాచారం అందుతుంది. ఉపాధ్యాయుల వృత్తిపరమైన శిక్షణ సమయంలో ఉదయం చెక్–ఇన్, సాయంత్రం చెక్–అవుట్ టైం నమోదు చేస్తోంది.
పారదర్శకంగా అమలు
తెలంగాణ విద్యాశాఖ అమలు చేస్తున్న టీజీ స్కూల్ యాప్‌ను జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పారదర్శకంగా అమలు చేస్తున్నాం. ఈ యాప్ ద్వారా ప్రతీ పాఠశాల సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. – భోజన్న, డీఈవో
జిల్లా సమాచారం...
ప్రాథమిక పాఠశాలలు 577
ప్రాథమికోన్నత పాఠశాలలు 89
ఉన్నత పాఠశాలలు 164
మొత్తం విద్యార్థులు 66,790
మొత్తం ఉపాధ్యాయులు 3,288


