ముధోల్: ఎల్‌నినో ప్రభావంతో ఆరుతడి పంటలు వేసుకోవాలని ప్రభుత్వం, వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. సంప్రదాయ పంటలు కాకుండా మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటల సాగుతో అధిక లాభాలు సాధించవచ్చని ఉద్యానవన అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రైతులను ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ పూలు, పండ్లు, కూరగాయలు సాగు చేసే రైతులకు డ్రిప్ ఇరిగేషన్‌తోపాటు వివిధ రాయితీలు ప్రకటించింది. ఆసక్తి ఉన్న రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది.
డ్రిప్, ఆయిల్‌పామ్ సబ్సిడీ
ఆయిల్‌పామ్ సాగుచేసే రైతులకు ఎన్ని ఎకరాలు సాగు చేసినా రాయితీ వర్తిస్తుంది. డ్రిప్ ఇరిగేషన్‌కు ఎకరానికి రూ. 22,518 సబ్సిడీ అందుతుంది. ఎకరం మొక్కలకు రూ.11,600 సబ్సిడీ లభిస్తుంది.
పండ్ల తోటలకు..
పండ్ల తోటల విస్తరణ పథకం కింద బొప్పాయి, అవకాడో, మామిడి, నిమ్మ, జామ, దానిమ్మ పంటలు సాగు చేసే రైతులకు 40 శాతం రాయితీ ఇస్తారు. బంతి, చామంతి, గులాబీ వంటి పూల మొక్కలకు 80 శాతం రాయితీ వర్తిస్తుంది.
సాగు వివరాలు
ముధోల్ నియోజకవర్గంలోని ముధోల్, కుంటాల, లోకేశ్వరం, కుభీర్, బాసర, భైంసా, తానూర్ ప్రాంతాల్లో 3,171 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. ఇక్కడ మామిడి, నిమ్మ, దానిమ్మ, పూలు, పసుపు, కూరగాయలు సాగవుతున్నాయి. పండ్ల తోటలు 150 ఎకరాలు, పూల తోటలు 40 ఎకరాలు, పసుపు 1,800 ఎకరాలు, కూరగాయలు 2,000 ఎకరాలు సాగులో ఉన్నాయి.
కూరగాయల పందిర్లు, నారు..
కూరగాయలు సాగు చేసే రైతులు పందిర్లు వేసుకోవడానికి 50 శాతం రాయితీ ఉంది. జిల్లా కోటాగా 20 యూనిట్లు కేటాయించారు. వివిధ రకాల కూరగాయల నారును 207 ఎకరాల వరకు ఉచితంగా అందిస్తున్నారు. బిందు సేద్యం పరికరాలకు ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, బీసీ రైతులకు 80 శాతం, ఇతర రైతులకు 70 శాతం రాయితీ వర్తిస్తుంది. కూరగాయల పంటలకు అవసరమైన మల్చింగ్ పేపర్‌ను 50 శాతం సబ్సిడీపై ఇస్తారు.
దరఖాస్తులు స్వీకరిస్తున్నాం..
ఉద్యనవన శాఖ ప్రకటించిన పథకాలకు అర్హులైన రైతులు ఆయా మండల ఉధ్యాన శాఖ అధికారులకు సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. కోటా మేరకు సబ్సిడీలు వర్తిస్తాయి. వరి పంట కాకుండా రైతులు కూరగాయలు, పండ్లు, పూల సాగు చేసి మంచి ఆదాయం పొందాలి.


