నాలుగు దశాబ్దాల స్నేహం.. | - | Sakshi
Sakshi News home page

నాలుగు దశాబ్దాల స్నేహం..

Aug 2 2026 12:04 AM | Updated on Aug 2 2026 12:04 AM

ఖానాపూర్‌: ‘మా ఇద్దరిని విధి కలిపింది.. స్నేహం జీవితానికి దారి చూపింది’ అని తన చిరకాల మిత్రుడు, ఇంద్రవెల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ సోయం మారుతితో ఉన్న నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ గుర్తు చేసుకున్నారు. స్నేహం అనేది రక్త సంబంధం కాకపోయినా జీవితాంతం నిలిచిపోయే అమూల్యమైన బంధమని తెలిపారు. ఉట్నూరు మండలం కల్లూరుగూడకు చెందిన బొజ్జు పటేల్‌, గాదిగూడ మండలం పూనగూడకు చెందిన సోయం మారుతి మధ్య స్నేహబంధం విద్యార్థి దశలోనే ప్రారంభమైంది. మాన్కాపూర్‌, గాదిగూడ ఉన్నత పాఠశాలల్లో తొమ్మిదో, పదో తరగతులు చదివిన రోజుల్లో ఏర్పడిన పరిచయం, ఆదిలాబాద్‌లో ఇంటర్‌, డిగ్రీ విద్యను అభ్యసించే సమయంలో మరింత బలపడింది. చదువుతోపాటు జీవన పోరాటంలోనూ ఇద్దరూ కలిసి నడిచారు. పేపర్‌ బాయ్స్‌గా పనిచేయడం నుంచి దారం మిల్‌, దాల్‌ మిల్‌లో ఉపాధి పొందడం వరకు, సెంట్రల్‌ పీపుల్స్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ సర్వే, హౌస్‌ హోల్డింగ్‌ సర్వే, రేషన్‌ కార్డుల సర్వే, ఉపాధి హామీ పథకం పనులు, అటవీ ప్రాంతాల్లో సేవలు, ఆదివాసీ విద్యార్థి ఉద్యమాలు, నల్గొండ జిల్లా చిట్యాల బత్తాయి తోటల్లో ఉపాధి పనులు వంటి అనేక రంగాల్లో కలిసి పనిచేశారు. అనంతరం ఐటీడీఏలో పీస్‌ కోఆర్డినేటర్‌గా బొజ్జు పటేల్‌, మొబిలైజర్‌గా సోయం మారుతి కలిసి సేవలందించారు. ఈ ప్రయాణం తమ జీవితంలో మరపురాని జ్ఞాపకాలుగా నిలిచిందంటారు బొజ్జు ‘స్నేహాన్ని మించింది మరొకటి లేదు. చిన్న చిన్న అపోహలు, ఇతరులు చెప్పిన మాటలు విని స్నేహితులకు దూరం కావొద్దు. ఏ విషయమైనా స్వయంగాా తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి. నిజమైన స్నేహం కాలంతో మరింత బలపడుతుంది’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement