తానూరు: రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సెక్షన్ అధికారి రవికుమార్ సూచించారు. తానూరుకు చెందిన రైతు పోతన్న శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ధర్మాబాద్ రోడ్డు సమీపంలో ఉన్న తన చేనులోకి వెళ్తుండగా చిరుతపులి పరుగులు తీస్తూ కనిపించింది. వెంటనే పోతన్న గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో సెక్షన్ అధికారి రవికుమార్, బీట్ అధికారి కృష్ణ, సిబ్బంది తానూరుకు చేరుకున్నారు. చేనులో పాదముద్రలను పరిశీలించి రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుత సంచారంతో తానూరు, జౌలా(బి), తొండాల గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు.


