వాన జోరు.. వరద హోరు | - | Sakshi
Sakshi News home page

వాన జోరు.. వరద హోరు

Jul 31 2026 1:51 AM | Updated on Jul 31 2026 1:51 AM

● జిల్లాలో విస్తారంగా వర్షాలు ● ఎగువ నుంచీ భారీగా వరదలు ● ఉప్పొంగుతున్న నదులు, వాగులు ● కడెం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత

నిర్మల్‌: జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షం గురువారం వరదనూ తీసుకొచ్చింది. జిల్లాతోపాటు ఎగువ ప్రాంతాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుల్లోకి వరద పొటెత్తింది. లక్షన్నర క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో ఈ సీజన్‌లో తొలిసారి కడెం ప్రాజెక్టు 16 గేట్లను ఎత్తి దిగువకు అదేస్థాయిలో నీటిని వదులుతున్నారు. సదర్‌మట్‌ బ్యారేజీకి 20,838 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో ఐదుగేట్లను ఎత్తి అంతేమొత్తంలో దిగువకు నీటిని వదులుతున్నారు. స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టుల్లోకీ వరద కొనసాగుతోంది. పలు మండలాల్లో వాగులు ఉప్పొంగుతుండటంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ఎస్పీ జానకీషర్మిల, అడిషనల్‌ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్‌, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్‌ ప్రాజెక్టులు, వాగులు పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా సూచించారు. పాఠశాలలకు గురువారం అత్యవసర సెలవు ప్రకటించారు.

సగటున 54.3 మిల్లీ మీటర్ల వర్షం..

జిల్లావ్యాప్తంగా గురువారం కూడా వర్షాలు విస్తారంగా కురిశాయి. జిల్లా సగటున 54.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణంగా కురవాల్సిన 10.4 మి.మీ.తో పోలిస్తే 422 శాతం అధికంగా వర్షం కురిసింది. అత్యధికంగా కడెం మండలంలో 122 మి.మీలు, పెంబి మండలంలో 105 మి.మీ. వర్షం నమోదైంది. ఖానాపూర్‌లో 93.4, దస్తూరాబాద్‌లో 88, మామడలో 63.4, నిర్మల్‌ పట్టణంలో 59.8, లక్ష్మణచందలో 52.6 మి.మీల, వర్షపాతం నమోదైంది. మరోవైపు సారంగాపూర్‌లో 47.6, సోన్‌లో 46.9, ముధోల్‌లో 44.6, దిలావర్‌పూర్‌లో 41.2, భైంసాలో 38.7, నర్సాపూర్‌(జి)లో 36.3, బాసరలో 33.1, కుంటాలలో 31.2, కుభీర్‌లో 27.5, తానూరులో 26, లోకేశ్వరం25.7 మి.మీల వర్షం కురిసింది.

ఆ మండలాల్లో ఇంకా తక్కువే..

ఈనెల 30 నాటికి జిల్లా సగటు వర్షపాతం 450.5 మి.మీ. నమోదుకాగా, సాధారణ వర్షపాతం 469.7 మి.మీతో పోలిస్తే 4 శాతం లోటు ఉంది. దీంతో జిల్లా మొత్తం సాధారణ వర్షపాతం కేటగిరీలో కొనసాగుతోంది. పెంబి, కడెం మండలాల్లో మాత్రమే సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ముధోల్‌, భైంసా, కుంటాల, నర్సాపూర్‌(జి), లోకేశ్వరం, దిలావర్‌పూర్‌, సారంగాపూర్‌, నిర్మల్‌ అర్బన్‌, నిర్మల్‌ రూరల్‌, సోన్‌, లక్ష్మణచంద, మామడ, ఖానాపూర్‌, దస్తూరాబాద్‌ మండలాల్లో సాధారణ వర్షపాతం కురిసింది. కుభీర్‌, తానూరు, బాసర మండలాల్లో లోటు వర్షపాతమే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement