● పంచాయతీరాజ్‌ చట్ట సవరణకు కేబినెట్‌ ఆమోదం ● ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వ నిర్ణయం | - | Sakshi
Sakshi News home page

● పంచాయతీరాజ్‌ చట్ట సవరణకు కేబినెట్‌ ఆమోదం ● ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వ నిర్ణయం

Jul 31 2026 1:51 AM | Updated on Jul 31 2026 1:51 AM

● పంచాయతీరాజ్‌ చట్ట సవరణకు కేబినెట్‌ ఆమోదం ● ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వ నిర్ణయం

లక్ష్మణచాంద: గ్రామ పంచాయతీలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు త్వరలోనే తీరనున్నాయి. గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వయంప్రతిపత్తి కల్పించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. పంచాయతీల ఆర్థిక కష్టాలు తీర్చేలా ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. పంచాయతీరాజ్‌ చట్టం 2018లోని సెక్షన్‌ 70(3)ను సవరించాలని కేబినెట్‌ నిర్ణయించింది. దీనితో నిధులను నేరుగా ఖర్చు చేసే అవకాశం కలుగుతుంది.

ఇప్పటి వరకు ఆంక్షలు..

గ్రామ పంచాయతీల సొంత ఆదాయ వనరులను నేరుగా ఖర్చు చేసుకోవడానికి ఇప్పటి వరకు అనేక నిబంధనలు అడ్డుగా ఉండేవి. ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం పంచాయతీల సొంత ఆదాయ వనరులను నేరుగా ఖర్చు చేసుకునే అవకాశం కల్పించనుంది.

జిల్లాలో ఇలా..

జిల్లా వ్యాప్తంగా 400 గ్రామ పంచాయతీలు ఉన్నా యి. ఏటా పన్నుల రూపంలో జిల్లాకు సుమారు రూ.10 కోట్లు వసూలవుతున్నాయి. వీటితోపాటు నూతన భవనాల అనుమతులు, ట్రేడ్‌ లైసెన్సులు, సంతలు, వారసంతలు, తైబజార్‌ వంటి ఇతర వనరుల ద్వారా అదనపు ఆదాయం సమకూరుతోంది. ఈ మొత్తాన్ని పంచాయతీ పాలకవర్గం ట్రెజరీలో జమ చేస్తోంది. దీంతో వీధి దీపాల మరమ్మతులు, తాగునీటి పైప్‌లైన్ల లీకేజీలు, స్టేషనరీ కొనుగోలు, పారిశుద్ధ్య పనుల నిర్వహణ వంటి ఖర్చులను ముందుగా పాలకవర్గాలే భరించాల్సి వస్తోంది. ఈ మొత్తం తర్వాత చెక్కు రూపంలో ట్రెజరీ కార్యాలయం నుంచి పంచాయతీ ఖాతాలో జమ అవుతోంది. బిల్లులు జమ కావడానికి ఒక్కోసారి నెలలు నుంచి సంవత్సరాల సమయం పడుతోంది. దీంతో చేసిన పనులకు సకాలంలో బిల్లులు రాక పనులు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కొన్ని చోట్ల అత్యవసర పనుల కోసం సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సొంత డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

కొత్త విధానం ఇలా..

గ్రామ పంచాయతీల సొంత ఆదాయ వనరులను నేరుగా ఖర్చు చేసుకునే కొత్త విధానం త్వరలోనే అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. రానున్న శాసనసభ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. ఈ నూతన విధానం పూర్తి స్థాయిలో అమలులోకి వస్తే పంచాయతీల ఆర్థిక కష్టాలు తీరనున్నాయి. గ్రామాల్లో వసూలయ్యే ఆదాయాన్ని స్థానిక బ్యాంకులో తెరిచిన ఖాతాలో జమ చేస్తారు. ప్రజల అవసరాల కోసం ఆ డబ్బుల నుంచి అవసరం మేరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. పంచాయతీల నిధులను సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ సంతకాలతో కాంట్రాక్టర్లకు ఇవ్వొచ్చు. ఈ నూతన విధానాన్ని త్వరగా అమలులోకి తేవాలని జిల్లా సర్పంచులు కోరుతున్నారు. నూతన విధానం అమలులోకి వస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement