కడెం: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కడెం ప్రాజెక్టును ఎస్పీ జానకీ షర్మిల, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ గురువారం సందర్శించారు. ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలు తెలుసుకున్నారు. కడెం నది పరీవాహక ప్రాంతాలకు వెళ్లొద్దని సమీప గ్రామాల ప్రజలకు సూచించారు. వారివెంట డీఆర్డీవో విజయలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ భూషణ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న ఉన్నారు.
రెంకోన వాగును పరిశీలించిన ఎస్పీ
ఖానాపూర్: భారీ వర్షాల నేపథ్యంలో ఖానాపూర్ హైటెక్ సిటీ సమీపంలోని రెంకోన వాగును ఎస్పీ జానకీషర్మిల గురువారం పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు, రెవెన్యూ అధికారులకు సూచనలు చేశారు. ప్రజలు, వాహనదారులు వాగు వద్దకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే బారికేడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. అనంతరం ఖానాపూర్ పోలీసు స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ, భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన సహాయక చర్యలపై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని వేగంగా స్పందించాలని ఆదేశించారు. ప్రజలు వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్పీవెంట నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, ఖానాపూర్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్సై రాహుల్ ఉన్నారు.


