ఖానాపూర్: ‘గిరిజన గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నాం.. మౌలిక వసతులు కల్పిస్తున్నాం..’ అని ప్రభుత్వాలు గొప్పలు చెబుతున్నా ఆచరణలో అమలుకు నోచుకోవడంలేదు. ఖానాపూర్ నియోజకవర్గంలోని పలు గిరిజన గ్రామాల ప్రజలు ఇప్పటికీ వాగులు దాటితేనే తమ గ్రామాలకు చేరుకునే పరిస్థితి. ఏటా వర్షాకాలం వారికి జీవన పోరాటమే. ఖానాపూర్, పెంబి మండలాల్లోని యాపల్‌గూడ, పస్పుల, తులసీపేట్, దయ్యాలమద్ది, అర్చన్‌తండా, గుమ్మెన, ఎంగ్లాపూర్, కుసుంపూర్, చామన్‌పల్లి గూడెం, పంగిడిగూడెం వంటి గ్రామాలకు వెళ్లాలంటే కడెం, దొత్తి, బల్లి వాగులు, ఒర్రెలను దాటాల్సిందే. వర్షం పడితే ఈ వాగులు ఉప్పొంగి గ్రామాలను బాహ్య ప్రపంచానికి దూరం చేస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో కూడా ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టి వాగులు దాటక తప్పని పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలోనే ఐటీడీఏ కార్యాలయం ఉన్నప్పటికీ దశాబ్దాలుగా వంతెనలు, రహదారులు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందలేదు. దీంతో ఆయా గిరిజన గ్రామాల ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. 2018లో ఎర్వచింతల్ వద్ద వాగు దాటుతుండగా కుసుంపూర్ గ్రామానికి చెందిన ఓ గిరిజన యువకుడు ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు. తాజాగా బుధవారం చామన్‌పల్లిగూడకు చెందిన పారుబాయి ఎర్వచింతల్‌కు వచ్చి స్వగ్రామానికి వెళ్తుండగా వాగులో గల్లంతై మృతి చెందింది. ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోతే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందిస్తారని ఆయా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరో ప్రాణం బలికాకముందే గిరిజన గ్రామాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.


