నిర్మల్‌చైన్‌గేట్: వన మహోత్సవం లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వన మహోత్సవం, జలసిరి ఫామ్ పాండ్‌ల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్లు, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జలసిరి ఫామ్‌పాండ్‌ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. నిజమైన అర్హుల పేర్లు ఎల్3 జాబితాలో ఉంటే అధికారులు ధృవీకరించి వారికి ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు చేపట్టాలన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
సమావేశం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందు వల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, వాగుల సమీపంలోకి పశు కాపరులు, మత్స్యకారులు, ఇతరులెవరూ వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, హౌసింగ్ పీడీ శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
వర్షపాతం వివరాలు ఖచ్చితత్వంతో
నమోదు చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా వ్యాప్తంగా వర్షపాతం వివరాలను ఎప్పటికప్పుడు ఖచ్చితత్వంతో నమోదు చేసి సంబంధిత శాఖలకు సకాలంలో అందించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూగర్భ జలాల కొలతల కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ నమోదు శాసీ్త్రయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించారు. పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీవో గంగారెడ్డి, తహసీల్దార్ ప్రభాకర్, ఆర్‌అండ్‌బి ఈఈ సుభాష్, హైడ్రో జియాలజిస్ట్ వంశీకృష్ణ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


