ఖానాపూర్: ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా స్కూల్ బస్సులు, ఇతర వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) రాణాశ్రీ హెచ్చరించారు. బుధవారం ఖానాపూర్‌లో రవాణాశాఖ అధికారులు పాఠశాలల బస్సుల భద్రతా ప్రమాణాలు, అవసరమైన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సును గుర్తించి జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల భద్రత విషయంలో పాఠశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహించరాదన్నారు. అన్ని పాఠశాలల యాజమాన్యాలు తమ బస్సుల ఫిట్‌నెస్‌ను ఎప్పటికప్పుడు పునరుద్ధరించుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.


