రుణాల చెల్లింపులో చేతివాటం | - | Sakshi
Sakshi News home page

రుణాల చెల్లింపులో చేతివాటం

Jul 14 2026 12:00 AM | Updated on Jul 14 2026 12:00 AM

● డిజిటల్‌ చెల్లింపులే శాశ్వత పరిష్కారం ● ‘మన సీ్త్రనిధి యాప్‌’తో మధ్యవర్తుల మోసాలకు చెక్‌

ఖానాపూర్‌: జిల్లాలో సీ్త్రనిధి, డ్వాక్రా సంఘాల రుణాల దుర్వినియోగ ఘటనలు వరుసగా వెలుగుచూస్తుండటం మహిళా సంఘాల సభ్యుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఖానాపూర్‌ మండలంలోని గోసంపల్లి, పాత ఎల్లాపూర్‌ గ్రామాల్లో సీ్త్రనిధి రుణాల రికవరీలో జరిగిన అక్రమాలు, నిర్మల్‌ పట్టణంలోని బ్రహ్మపురి కాలనీ డ్వాక్రా గ్రూపు నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు అందడం చర్చనీయాంశంగా మారింది.

సోషల్‌ ఆడిట్‌లో వెలుగులోకి..

గోసంపల్లి, పాత ఎల్లాపూర్‌ గ్రామాల్లో నిర్వహించిన సోషల్‌ ఆడిట్‌లో సుమారు రూ.28 లక్షలకుపైగా నిధులు దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. మహిళలు చెల్లించిన రుణ వాయిదాలు సంబంధిత ఖాతాల్లో జమ కాకపోవడం, నగదు లావాదేవీల్లో పారదర్శకత లేకపోవడం వంటి అంశాలు ఈ ఘటనలకు ప్రధాన కారణాలుగా అధికారులు భావిస్తున్నారు. ఇదే తరహాలో నిర్మల్‌ పట్టణంలోని బ్రహ్మపురి కాలనీకి చెందిన డ్వాక్రా గ్రూపుకు సంబంధించిన రూ.25 లక్షల నిధులు సభ్యులకు తెలియకుండా దుర్వినియోగం చేశారంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు అందడం కూడా మహిళా సంఘాల్లో ఆందోళనకు దారితీసింది.

నగదు లావాదేవీలతో అక్రమాలు..

ప్రస్తుతం నగదు రూపంలో చెల్లింపులు చేయడం వల్లే ఎక్కువగా దుర్వినియోగాలకు అవకాశం ఏర్పడుతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రుణ వాయిదాలు నేరుగా ఖాతాల్లో జమ కాకపోవడం, మధ్యవర్తుల ప్రమేయం వంటి సమస్యలు మహిళలను ఆర్థికంగా నష్టపరుస్తున్నాయి.

డిజిటల్‌ విధానంతో ప్రయోజనాలు..

డిజిటల్‌ చెల్లింపుల ద్వారా ప్రతి లావాదేవీకి వెంటనే రసీదు, బ్యాంకు ఎస్‌ఎంఎస్‌, ట్రాన్సాక్షన్‌ ఐడీ లభిస్తాయి. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తినా సభ్యులకు స్పష్టమైన ఆధారాలు అందుబాటులో ఉంటాయి. డబ్బు నేరుగా సంస్థ ఖాతాలో జమ కావడంతో మధ్యవర్తుల ప్రమేయానికి అవకాశం ఉండదు. దీంతో పారదర్శకత పెరిగి, ఇలాంటి దుర్వినియోగాలకు అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

డిజిటల్‌ చెల్లింపులే శాశ్వత పరిష్కారం

ఈ అక్రమాలను అరికట్టేందుకు ప్రతి మహిళా సంఘం సభ్యురాలు డిజిటల్‌ చెల్లింపులపై అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రుణ వాయిదాలను నేరుగా అధికారిక బ్యాంకు ఖాతాలకు జమ చేసే విధానాన్ని అనుసరించాలని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా ‘మన సీ్త్రనిధి యాప్‌’ ద్వారా సభ్యులు తమ రుణ ఖాతా వివరాలు, డీసీబీ, బకాయిలు, చెల్లించిన వాయిదాల వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు. యూపీఐ ద్వారా నేరుగా చెల్లింపులు చేసే అవకాశం కూడా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement