శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్
నర్సాపూర్(జి): శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్ అన్నారు. మండలంలోని టెంబుర్ని గ్రామంలో సోమవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ధ్రువపత్రాలు సరిగా లేని 69 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరాలు, డ్రగ్స్ దుర్వినియోగం, రోడ్డు భద్రతా నియమాలు, డయల్ 100, సీసీ కెమెరాల ప్రాముఖ్యత వంటి విషయాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు, మోసాలకు లోనవకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. అనుమానాస్పద వ్యక్తుల కార్యకలాపాలు గమనించినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాల ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. కార్యక్రమంలో నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ, స్థానిక ఎస్సై గణేశ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


