చైనా మాంజా ప్రమాదకరం
సారంగపూర్: సంక్రాంతి పండుగ సందర్భంగా ఎగురవేసే గాలిపటాలకు చైనా మాంజా వినియోగించడం ప్రమాదకరమని సారంగాపూర్ డిప్యూటీ రేంజ్ అధికారి నజీర్‌ఖాన్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు చైనా మాంజాతో కలిగే అనర్థాలను, ప్రమాదాలను వివరించారు. గాలి పటాలు ఎగురవేసేందుకు వినియోగించే చైనా మాంజా కనిపించని పదునైన కత్తిలాంటిదన్నారు. దీనిని గాజుముక్కలు, ఇంకా కొన్ని రసాయనాలు వినియోగించి తయారు చేయడంతో అది భూమిలో కలిసినా తొందరగా పాడవని లక్షణం కలిగి ఉంటుందని తెలిపారు. ద్విచక్రవాహనదారులు, అలాగే ఆకాశంలో స్వేచ్ఛగా విహరించే పక్షులకు ప్రాణాంతకంగా మారుతుందని తెలిపారు. గాలిపటాలు ఎగురవేసే సమయంలో రోడ్డుకు ఈదారం అడ్డుగా ఉంటే ఆదారిలో ప్రయాణించే ద్విచక్రవాహనచోదకుల మెడకు చుట్టుకుని ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. గాలి పటాలకు సాధారణ కాటన్ దారాన్ని మాత్రమే వినియోగించాలని సూచించారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తే సమీప పోలీస్టేషన్‌కు, లేదా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శంకర్, ఎఫ్‌ఎస్‌వో రషీద్, ఎఫ్‌బీఓలు సుజాత, వెన్నెల, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


