ముందస్తుగా ఇంటర్ హాల్‌టికెట్లు
లక్ష్మణచాంద: ఇంటర్ బోర్డు విద్యార్థులకు శుభవార్త చెప్పింది. హాల్‌టికెట్లలో తప్పుల సవరణకు అవకాశం కల్పించింది. ఈమేరకు విద్యార్థుల తల్లిదండ్రులకు ముందస్తుగా హాల్ టికెట్లు పంపనున్నారు. ఈ హాల్ టికెట్లలో ఏమైనా తప్పులు ఉంటే వెంటనే ఆయా కళాశాల ప్రిన్సిపల్‌కు సమాచారం ఇచ్చి సరిచేసుకోవచ్చు.
అన్ని వివరాలు సర్దుబాటు
ఇంటర్ బోర్డు కల్పించిన ఈ అవకాశంతో ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులు తమ పేరు, తండ్రి పేరు, ఇంటి పేరు, జెండర్, పుట్టిన తేదీ, గ్రూపు, మీడియం వంటి వివరాలను సరి చేసుకోవచ్చు. ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థుల తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా ఇంటర్ బోర్డు అధికారులు మెసేజ్‌లు పంపారు. ఈ మెసేజ్‌లో విద్యార్థి 10వ తరగతి హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేస్తే ప్రీ హాల్ టికెట్ డౌన్‌లోడ్ అవుతుంది. డౌన్‌లోడ్ అయిన హాల్ టికెట్‌లో తప్పులు ఉంటే వెంటనే కళాశాల ప్రిన్సిపల్ ద్వారా జిల్లా నోడల్ అధికారికి పంపాలి. అక్కడి నుంచి ఇంటర్ బోర్డుకు సమాచారం చేర్చి తప్పులు సరిచేస్తారని అధికారులు తెలిపారు.
జిల్లాలో 7,069 మందికి ప్రయోజనం
జిల్లా 19 మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు 69 ఉన్నాయి. వీటిలో 7,069 మంది విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరం అభ్యసిస్తున్నారు. ఈ అవకాశంతో అందరూ ప్రయోజనం పొందనున్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు.
తొలగనున్న ఇబ్బందులు..
గతంలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులు మీడియం, గ్రూపు, పుట్టిన తేదీ, పేరు, తండ్రి పేరు వంటి వివరాలు సరిచేయాలంటే ఇంటర్ బోర్డుకు రుసుము చెల్లించాల్సి వచ్చేది. సరి చేయని విద్యార్థుల హాల్ టికెట్లలో తప్పులు రావడంతో నష్టపోయేవారు. ఇంటర్ పూర్తయిన తర్వాత బోర్డు చుట్టూ తిరగాల్సివచ్చేది. అవన్నీ తాజా అవకాశంతో తొలగనున్నాయి. విద్యార్థులు తమ వివరాలను జాగ్రత్తగా పరిశీలించి, తప్పులు ఉంటే ప్రిన్సిపాల్ ద్వారా జిల్లా ఇంటర్ నోడల్ అధికారి కార్యాలయానికి సమాచారం చేరవేయాలని అధికారులు పేర్కొన్నారు.
జిల్లా సమాచారం...
జిల్లాలో జూనియర్ కళాశాలలు 69
మొదటి సంవత్సరం విద్యార్థులు 7,069


