గడువులోగా అభ్యంతరాలు సమర్పించాలి
నిర్మల్‌చైన్‌గేట్: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రూపొందించిన ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలను నిర్ణీత గడువులోగా సమర్పించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల పరిధిలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా తయారీ, అభ్యంతరాల స్వీకరణ, తుది జాబితా ప్రచురణ ప్రక్రియను వివరించారు. ఎన్నికల ప్రక్రియను పూర్తిస్థాయిలో పారదర్శకంగా, లోపాలు లేకుండా నిర్వహిస్తామన్నారు. మున్సిపాలిటీల వారీగా అభ్యంతరాలను సమీక్షించి, వాటిని నిబంధనల ప్రకారం పరిష్కరిస్తామన్నారు. ఈ నెల 9 వరకు అభ్యంతరాలు మున్సిపల్ కమిషనర్లకు లేదా జిల్లా అధికారులకు అందజేయాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10న పోలింగ్ స్టేషన్లవారీగా తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు, సమగ్ర ఓటరు జాబితా రూపొందించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. అంతకుముందు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటరు జాబితా, మ్యాపింగ్, వలస ఓటర్లు, చిరునామాలు తదితర అంశాలపై తమ అభ్యంతరాలు, సందేహాలను వ్యక్తం చేయగా అధికారులు నివృత్తి చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్‌గౌడ్, సుందర్ సింగ్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
నిర్మల్ ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి
నిర్మల్ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లను ప్రారంభించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. నిర్మల్ ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 19 నుంచి 23 వరకు నిర్మల్ ఉత్సవాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గతేడాది విజయవంతంగా నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందామని తెలిపారు. నిర్మల్ జిల్లా చరిత్ర, సాంస్కతిక వారసత్వాన్ని ఉత్సవాల వేదిక ద్వారా ప్రజలకు పరిచయం చేయగలిగామన్నారు. ఈ ఏడాది మరింత ఉత్సాహంతో, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్మల్ ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమాల నిర్వహణకు ఎన్టీఆర్ మినీ స్టేడియాన్ని సిద్ధం చేయాలని, సుందరీకరణ పనులు చేపట్టి మరుగుదొడ్లు, లైటింగ్ సదుపాయాలు కల్పించాలన్నారు. వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం కేటాయించాలన్నారు. జిల్లాలోని పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఈవో భోజన్న, డీవైఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ నర్సయ్య, డీపీఆర్వో విష్ణువర్ధన్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, ఈడీఎం నదీమ్ పాల్గొన్నారు.


