ముక్కోటికి ముస్తాబు
నిర్మల్‌టౌన్: వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని జిల్లాలోని వైష్ణవాలయాలను అందంగా ముస్తాబు చేశారు. ఉదయం నుంచి భక్తులతో ఆలయాలు కిటకిటలాడనున్నాయి. పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున మంగళవారం ఉపవాసం ఉండి లక్ష్మీసమేతుడైన మహావిష్ణువుని భక్తితో పూజించి, రాత్రి జాగరణ చేస్తారు. ఈ మేరకు ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు, దేవాలయాలకు విద్యుత్ దీపాలు, పూలదండలతో అలంకరించారు. టెంట్లు వేసి మంచినీటి సౌకర్యం కల్పించారు. భక్తులకు సరిపడా లడ్డూ, పులిహోర ప్రసాదాలు సిద్ధం చేశారు. అంతేకాకుండా భక్తులకు ప్రత్యేక దర్శనం, సాధారణ దర్శన క్యూలైన్లను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని 450 ఏళ్ల నాటి చారిత్రక దేవరకోట శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆల య కమిటీ, దేవదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వారా దర్శనం ప్రారంభిస్తామని తెలిపారు. ఉదయం 7 గంటలకు స్వామివారికి తులసి అర్చన వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఏర్పాట్లు పూర్తి..
ఏటా ధనుర్మాసం ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం. ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ నాథుడి దర్శనానికి భక్తులు వేలాదిగా ఆలయానికి తరలివస్తారు. భక్తుల రద్దీకి అనుకూలంగా ఏర్పాట్లను చేశాం. వైకుంఠ దర్శనానికి క్యూలైన్లు ఏర్పాటు చేశాం. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. –ఆమెడ శ్రీనివాస్, దేవరకోట
లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ చైర్మన్
ముక్కోటికి ముస్తాబు


