
కళాకారులకు సహకారం అందిస్తాం
నిర్మల్ టౌన్: నిర్మల్ కొయ్య బొమ్మలతో జీవనోపాధి పొందుతున్న కళాకారులకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ శర్వాణన్ అన్నారు. జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆర్థిక సహకారంతో నిర్మల్ కొయ్య బొమ్మల సహకార సంఘం కోరిక మేరకు రూ.7 లక్షల విలువైన టాటా మ్యాజిక్ వాహనాన్ని, రూ.5 లక్షలను వారి వనరుల కొనుగోలుకు జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వాహనంతో వారి సరుకులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రవాణా చేసుకుంటూ.. లాభాలు సంపాదించాలని సూచించారు. అలాగే భవిష్యత్తులో వారి అభ్యున్నతికి అటవీశాఖ తరఫున ఎలాంటి సహాయం కావాలన్నా అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి నాగినిభాను, నిర్మల్ రేంజ్ ఫారెస్ట్ అధికారి రామకృష్ణారావు, సంతోష్‌కుమార్, నిర్మల్ కొయ్య బొమ్మల సహకార సంఘ సభ్యులు పాల్గొన్నారు.