
పంట నష్టం 13 వేల ఎకరాలు
ప్రభుత్వం ఆదుకోవాలి
గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో మా గ్రామంలో పంటలు మూడు రోజులుగా నీటమునిగే ఉన్నాయి. సుమారు 600 ఎకరాల్లో నష్టపోయాం. అధికారులు సర్వే చేసి నష్టం అంచనా వేయాలి. ప్రభుత్వం బాధిత రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలి.
– అశోక్, రైతు చింతల్‌చాంద
నివేదిక పంపించాం..
జిల్లాలో కురిసిన భారీ వర్షాలతోపాటు గోదావరి నది పరీవాహక ప్రాంతాల్లో వరద ఉధృతికి రైతులు పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ ఆదేశాలు, కలెక్టర్ సూచనల మేరకు పంట నష్టంపై ప్రాథమిక సర్వే నిర్వహించాం. ఇప్పటి వరకు 13 వేలకుపైగా వివిధ పంటలు నష్టపోయినట్లుగా గుర్తించాం. ఈమేరకు నివేదికను ప్రభుత్వానికి పంపించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. ఆదివారం వరకు నష్టం ఎంత జరిగిందనే స్పష్టత వస్తుంది.
– అంజిప్రసాద్, డీఏవో నిర్మల్
లక్ష్మణచాంద: జిల్లాలో నాలుగు రోజులు కురిసిన భారీ వర్షాలు అన్నదాతను నిండా ముంచాయి. ఎ గువ మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు కురుస్తున్నా యి. దీంతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి మూడు రో జులుగా 5 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చింది. దీంతో 39 గేట్ల ద్వారా ఐదు లక్షల క్యూసెక్కులకుపైగా నీటిని గోదావరిలోకి విడుదల చేశా రు. దీంతో జిల్లాలోని గోదావరి పరీవాహక గ్రామాల్లో రెండో రోజూ కొనసాగింది. ఇక లక్ష్మణచాంద మండలం పీచర, ధర్మారం, మల్లాపూర్, మాచాపూర్, మునిపెల్లి, చింతల్‌చాంద, చామన్‌పెల్లి గ్రామాల్లో గోదావరి తీరప్రాంత పంటలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. మూడు రోజులుగా పంటలు నీటిలో మునిగి ఉండటంతో నిండా మునిగామని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
13 వేల ఎకరాలకుపైగా నష్టం..
భారీ వర్షాలతోపాటు, ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు ద్వారా గోదావరిలోకి భారీగా నీటిని విడుదల చేశారు. దీంతో భైంసా, ముధోల్, నిర్మల్, ఖానాపూర్ డివిజన్లలో సాగు చేసిన పంటలు కూడా దెబ్బతిన్నాయి. వ్యవసాయ అధికారుల ప్రకారం, వరి 24,191 ఎకరాలు, మొక్కజొన్న 1,100 ఎకరాలు, సోయాబీన్ 2,152 ఎకరాలు, పత్తి 2,788 ఎకరాల్లో నష్టం జరిగింది.
భైంసా డివిజన్‌లో..
భైంసా డివిజన్‌లో 348 రైతులకు చెందిన 558 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇందులో వరి 98 ఎకరాలు(49 రైతులు), పత్తి 210 ఎకరాలు(175 రైతులు), సోయాబీన్ 230 ఎకరాలు(114 రైతులు), మొక్కజొన్న 20 ఎకరాలు(10 రైతులు) ఉన్నాయి.
ముధోల్ డివిజన్‌లో..
ముధోల్ డివిజన్‌లో 890 రైతులకు చెందిన 1,785 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో వరి 116 ఎకరాలు(87 రైతులు), పత్తి 275 ఎకరాలు(190 రైతులు), సోయాబీన్ 1,287 ఎకరాలు(613 రైతులు) ఉన్నాయి.
ఖానాపూర్ డివిజన్‌లో..
ఖానాపూర్ డివిజన్‌లో 849 రైతులకు చెందిన 1,510 ఎకరాల్లో పంట నష్టం నమోదైంది. ఇందులో వరి 517 ఎకరాలు(350 రైతులు), పత్తి 875 ఎకరాలు(487 రైతులు), మొక్కజొన్న 35 ఎకరాలు(12 రైతులు) ఉన్నాయి.
నిర్మల్ డివిజన్‌లో..
నిర్మల్ డివిజన్‌లో 2,675 రైతులకు చెందిన 5,296 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇందులో వరి 1,760 ఎకరాలు(1,127 రైతులు), పత్తి 1,463 ఎకరాలు(668 రైతులు), సోయాబీన్ 635 ఎకరాలు(412 రైతులు), మొక్కజొన్న 1,045 ఎకరాలు(470 రైతులు) ఉన్నాయి.

పంట నష్టం 13 వేల ఎకరాలు

పంట నష్టం 13 వేల ఎకరాలు