
నిమజ్జనానికి పటిష్ట భద్రత
శోభాయాత్రలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు..
ట్రాఫిక్‌కు అంతరాయం కలగొద్దు..
శోభాయాత్ర మార్గాల్లో సీసీ కెమెరాలు..
ఎస్పీ జానకీషర్మిల
నిర్మల్ టౌన్: గణేశ్ నిమజ్జన శోభాయాత్రలు జిల్లాలో ప్రశాంతంగా జరిగేలా ప్రతీ పోలీసు పనిచేయాలని ఎస్పీ జానకీషర్మిల ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీసు కార్యాలయం నుంచి జిల్లా పోలీసులతో శనివారం ఆన్‌లైన్‌లో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిమజ్జన ఏర్పాట్లపై సూచనలు చేశారు. శోభాయాత్ర మార్గాల్లో ముందస్తు తనిఖీలు నిర్వహించి అడ్డంకులు లేకుండా చూడాలని ఆదేశించారు. పట్టణాల్లో ప్రధాన రహదారులు, కూడళ్లు, నిమజ్జన ఘాట్ల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రత్యేక డైవర్షన్ ప్రణాళికను అమలు చేయాలని ఎస్పీ సూచించారు. శోభాయాత్ర మార్గాల్లో డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ జరపాలని ఎస్పీ తెలిపారు.
వరద బాధితులకు సాయం చేయాలి..
జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో గ్రామాలు, పట్టణాలు జలమయమై, లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లు నీటమునిగాయి. వాగులు, వంకలు పొంగడంతో రహదారులు దెబ్బతిన్నాయి. మరో రెండు రోజులు వర్ష సూచనలు ఉన్నందున, ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. వరదల్లో చిక్కుకున్నవారికి తక్షణ సహాయం అందించేందుకు రెస్క్యూ, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, లైఫ్ జాకెట్లు, రబ్బర్ బోట్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. వరద ఎక్కువగా ఉన్న చెరువులు, వాగులు, రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రెడ్ ఫ్లాగ్స్ ఏర్పాటు చేసి, వాటిని డేంజర్ జోన్‌గా గుర్తించి ప్రజలకు తెలియజేయాలని సూచించారు.ఈ కాన్ఫరెన్స్‌లో అదనపు ఎస్పీలు ఉపేంద్రారెడ్డి, అవినాష్‌కుమార్, రాజేశ్‌మీనా, ఇన్‌స్పెక్టర్లు, అన్ని పోలీసు స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు పాల్గొన్నారు.
నిమజ్జన ఘాట్‌ను పరిశీలించిన ఎస్పీ
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని బంగల్‌పేట్ చెరువు వద్ద వినాయక నిమజ్జన ఘాట్‌ను ఎస్పీ జానకీషర్మిల శనివారం పరిశీలించారు. శోభాయాత్ర దారిలో చేపడుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. నిమజ్జన ఘాట్ వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ వెంట ఏఎస్పీ రాజేశ్‌మీనా, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ ఉన్నారు.