నయనాలు చూసి గుండె ఆరోగ్యం చెప్పేయొచ్చు
వృద్ధాప్యాన్ని, వయసు వేగాన్ని లెక్కకట్టొచ్చు
రోగ నిర్ధారణలో కీలకం కానున్న సమాచారం
ముఖం చూసి ఆ మనిషి మూడ్ ఏంటో చెప్పేస్తాం. అలాగే కళ్లు కూడా మన గురించి ఎన్నో విషయాలు చెబుతాయి. కళ్లు నవ రసాలను పలికించటమే కాదు.. మన దేహంలో సూక్ష్మ స్థాయిలో దాగున్న జబ్బుల జాడల్ని కూడా సూక్ష్మంగా అందించగలవట. మన కళ్లలోకి చూసి మన గుండె ఆరోగ్యాన్ని చెప్పేయొచ్చు. అలాగే మన వయసు ఎంత వేగంగా అయిపోతోంది లేదా వృద్ధాప్యంలోకి ఎంత వేగంగా వెళ్లిపోతున్నాం అనేది కూడా కచ్చితంగా చెప్పవచ్చని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.
కంటిలోని చిన్న రక్తనాళాలను లోతుగా పరిశీలిస్తే.. ఆ వ్యక్తికి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం ఎంత మేరకు ఉందో తెలిసిపోతుంది. అంతేకాదు.. ఒకరి హృదయ నాళాల ఆరోగ్యం, జీవసంబంధమైన వృద్ధాప్య స్థితిని కూడా కళ్లు చెప్పేస్తాయని ఓ తాజా పరిశోధనలో వెల్లడైంది.
ఎంతమందిపై చేశారు?
కెనడాలోని మెక్‌మాస్టర్ విశ్వవిద్యాలయం, పాపులేషన్ హెల్త్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు 74 వేల మందిపై సంయుక్త పరిశోధనలు చేశారు. వీరి రెటీనా స్కాన్లు, జన్యు డేటా, రక్త నమూనా విశ్లేషణలను నాలుగు వేర్వేరు సంస్థల నుంచి సేకరించి పరిశోధించారు. కళ్ల ద్వారా తెలుసుకోగలిగే ఆరోగ్య స్థితిగతులపై అత్యంత ఆసక్తికర విషయాలు తెలిశాయి. సైన్సెస్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ఇటీవల ఈ పరిశోధన ఫలితాలు ప్రచురితమయ్యాయి.
ఎలా చేశారు?
‘కంటిలో ముఖ్యమైన భాగం రెటీనా. రెటీనా స్కాన్ నివేదికల సమాచారంతో జన్యుశాస్త్రం, రక్తపు బయోమార్కర్లను అనుసంధానం చేయటం ద్వారా వృద్ధాప్యం హదృయనాళ వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తోందో కనుక్కోవటంలో విజయం సాధించాం. రెటీనా రక్తనాళాల్లో మార్పులు తరచుగా శరీరంలోని చిన్న నాళాల్లో జరిగే మార్పులకు అద్దం పడతాయి’ అన్నారు ఈ అ«ధ్యయన రచయిత ప్రొఫెసర్ మేరీ పిగేయ్రే.
ఏంటి ప్రాధాన్యత?
గుండెకు రక్తాన్ని అందించే నాళాలకు ఎన్ని తక్కువ ఉప నాళాలు ఉంటే గుండె జబ్బుల ముప్పు అంత ఎక్కువగా ఉందని గుర్తించారు. శరీరంలో అధిక వాపు, తక్కువ ఆయుర్దాయం వంటి జీవసంబంధమైన వృద్ధాప్య సంకేతాలను కూడా రెటీనా స్కాన్లు చూపగలుగుతున్నాయని కనుగొన్నారు. రోగ నిర్ధారణ, చికిత్సల్లో దీని ప్రాధాన్యం ఏమిటంటే.. శరీరం లోపలికి ఏ పరికరాన్నీ చొప్పించకుండానే వ్యాధులను ముందుగానే సూక్ష్మంగా గుర్తించడానికి, చికిత్స చెయ్యటానికి రెటీనా స్కాన్ల సమాచారం కీలకం కాబోతోంది.
ఏంటా ప్రోటీన్లు?
ఈ అధ్యయనంలో మరో ముఖ్యమైన అంశం రక్తపు బయోమార్కర్లు, జన్యు డేటాను సమీక్షించటం. దీని ద్వారా, పరిశోధకులు కంటి రక్త నాళాల్లో మార్పుల వెనుక గల జీవసంబంధమైన కారణాలు కనుగొనగలిగారు. రక్తనాళాలలో వచ్చే మార్పులకు కారణమవుతున్న రెండు ముఖ్యమైన ప్రోటీన్లను ఈ పరిశోధనలో కనిపెట్టారు.
వృద్ధాప్యం వేగాన్ని నెమ్మదింపజేయటానికి, గుండె జబ్బుల భారాన్ని తగ్గించడానికి.. భవిష్యత్తులో ఔషధాల తయారీకి, చివరికి జీవితకాలం మెరుగుపరచడానికి.. ఈ ప్రొటీన్లు ఉపయోగపడతాయని ప్రొఫెసర్ మేరీ పిగేయ్రే వివరించారు.
– సాక్షి, స్పెషల్ డెస్క్


