
తమిళనాడు: 30 సంవత్సరాలుగా తమ ఆదీనంలోని భూమిని 60 సంవత్సరాల క్రితం మృతి చెందిన వ్యక్తి పేరిట పట్టా ఇవ్వడాన్ని తప్పుబడుతూ యువతి చంటి పాపతో వచ్చి కలెక్టర్ ప్రతాప్, ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్‌తో వాగ్వాదానికి దిగిన సంఘటన కలెక్టర్ కార్యాలయంలో కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా విడయూర్ గ్రామానికి చెందిన గోవిందరాజ్‌కు అదే ప్రాంతంలో 30 సెంట్లు వ్యవసాయ భూమి ఉంది. సంబంధిత పొలంలో గోవిందరాజ్ సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గోవిందరాజ్ పొలానికి సమీపంలోనే కుళ్లప్పరెడ్డి కుమారుడు ఏలుమలై, గోవిందరాజ్ సోదరుడు నాగరత్నంకు చెందిన వ్యవసాయ పొలం ఉంది. కుళ్లప్పరెడ్డి సుమారు 60 సంవత్సరాల క్రితం మృతి చెందాడు.
ఈ క్రమంలో గత మూడు సంవత్సరాల క్రితం గోవిందరాజ్ అ«దీనంలోని వ్యవసాయ పొలాన్ని కుళ్లప్పరెడ్డి పేరిట పట్టాను నాగరత్నం మార్చినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న గోవిందరాజ్ కుమార్తె అనిత పట్టా మారి్పడిపై గత రెండు సంవత్సరాలుగా వినతిపత్రాలు ఇస్తోంది. అయితే ఇంత వరకు ఫలితం లేదు. దీంతో సోమవారం ఉదయం గ్రీవెన్స్‌డేలో వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ ప్రతాప్, తిరువళ్లూరు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్‌ను కలిసి వినతి పత్రం సమరి్పంచారు. ఈ వినతి పత్రంపై తక్షణం విచారణ చేయాలని కలెక్టర్‡ ఆర్డీఓ రవిచంద్రన్‌ను ఆదేశించారు.
అయితే కలెక్టర్ ఆదేశాలపై యువతి వాగ్వాదానికి దిగింది. ఇప్పటి వరకు 9 సార్లు వినతి పత్రం ఇచ్చామని, వినతి పత్రం ఇచ్చిన ప్రతి సారీ విచారణ అంటూనే కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించింది. న్యాయం జరిగేది ఎప్పుడూ అంటూ గట్టిగా కేకలు వేయడంతో గ్రీవెన్స్ హాలు నిశ్శబ్దంగా మారిపోయింది. తనకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని తేల్చి చెప్పడంతో కలెక్టర్ యువతిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులను పిలిపించి యువతిని బయటకు పంపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.