దక్షిణాదిన వానలు.. ఉత్తరాదిన ఎండలు | Weather is changed in India | Sakshi
Sakshi News home page

దక్షిణాదిన వానలు.. ఉత్తరాదిన ఎండలు

Published Thu, Jun 13 2024 3:33 PM | Last Updated on Thu, Jun 13 2024 3:52 PM

Weather is changed in India

ఉత్తరాదిన భానుడి భగభగలు.. దక్షిణాన విస్తారంగా వర్షాలు

రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు

తెలంగాణలో చురుగ్గా నైరుతి రుతుపవనాలు

ఢిల్లీ, హరియాణా, యూపీ, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు

మండోలాలోని పవర్‌ గ్రిడ్‌లో అగ్నిప్రమాదం.. ఢిల్లీలో కరెంట్ కోతలు

దేశంలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తరాదిన ఎండలు మండిపోతుంటే.. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరుణుడు పలకరించడంతో తెలుగు రాష్ట్రాల్లో వెదర్ కాస్త చల్లబడింది. మొన్నటి వరకూ దేశవ్యాప్తంగా ఎండలు దంచికొట్టాయి. ఉత్తరం, దక్షిణం అనే తేడా లేకుండా ఉష్ణోగ్రతలు ఠారెత్తించాయి. అయితే రుతుపవనాలు పలకరించాక, వాతావరణం మారింది. ఉత్తరాదిన భానుడి భగభగలు కొనసాగుతుంటే.. దక్షిణాదిన మాత్రం వర్షాలు పడుతున్నాయి. వేడి, ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.

మరో మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇటు తెలంగాణలోనూ నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు ఐఎండీ వెల్లడించింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 2 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీచేసింది ఐఎండీ.

వర్షాలతో దక్షిణాది చల్లబడినా.. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో వేడి వాతావరణం కొనసాగుతోంది. భానుడి భగభగలు సెగలు పుట్టిస్తున్నాయి. వేడి గాలులు వీస్తున్నాయి. ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజధాని ఢిల్లీలో సోమవారం ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్‌ దాటింది. రానున్న రోజుల్లో ఇది 47 డిగ్రీలకు చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఎల్లో అలర్ట్ ఇష్యూ చేసింది.

హీట్‌వేవ్, నీటి సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న దేశ రాజధానిపై మరో పిడుగు పడింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి భారీగా విద్యుత్‌ కోతలను ఎదుర్కొంటోంది. ఉత్తర్‌ప్రదేశ్‌ మండోలాలోని పవర్‌ గ్రిడ్‌లో అగ్నిప్రమాదం జరగడంతో ఢిల్లీ వాసులకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. నగరానికి ఈ గ్రిడ్‌ నుంచి 1500 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ సరఫరా అవుతుంది. మొత్తంగా ఉత్తరాది ప్రజలు ఇటు ఉష్ణోగ్రతలు, అటు ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement