వరస సంచలన నిర్ణయాలతో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. తాజాగా.. రాష్ట్రంలోని 234 మంది ఎమ్మెల్యేలకూ కొత్త ప్రభుత్వ కార్లు అందించనున్నట్లు అసెంబ్లీలో వెల్లడించారు. చట్ట సభ్యుల్లో చాలామంది కొత్తవాళ్లని.. పైగా వాళ్లంతా సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారని.. అందుకే ఈ నిర్ణయమని ప్రకటించారాయన. అంతేకాకుండా.. మరికొన్ని సంక్షేమ ప్రకటనలు సైతం చేశారు.
ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలంటే నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాల్సి ఉంటుందని సీఎం విజయ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలందరికీ ప్రభుత్వ వాహనాలను సమకూర్చనున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ప్రస్తుత అసెంబ్లీలో తొలిసారి ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు సాధారణ కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చినవారని.. వారికి ప్రజా సేవ చేసేందుకు అవసరమైన రవాణా సదుపాయం ఉండాలని సీఎం వివరించారు. దీంతో పాటు కారు డ్రైవర్ జీతం, ఇంధనం, నిర్వహణ ఖర్చుల కోసం నెలకు రూ.75 వేల భత్యం ఇవ్వనున్నట్లు తెలిపారు.
అదనంగా మరో రూ.25 వేలు
అంతేకాకుండా ఎమ్మెల్యే కార్యాలయంలో అధికారిక పనుల కోసం సహాయకుడిని నియమించుకునేందుకు నెలకు రూ.25 వేల గ్రాంట్ ఇవ్వనున్నారు. ఈ నిర్ణయం వీసీకే ఎమ్మెల్యే జోతిమణి చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో వెలువడింది. ఎమ్మెల్యేలకు అవసరమైన లాజిస్టికల్ సపోర్ట్ లేకుండా సమర్థంగా పనిచేయడం కష్టమని ఆమె అసెంబ్లీలో ప్రస్తావించారు.
‘క్లీన్ గవర్నెన్స్’ కోసమే..
ఎమ్మెల్యేలకు ప్రభుత్వ వాహనాలు, ఇతర సదుపాయాలు కల్పించడం వల్ల నియోజకవర్గ పర్యటనలు సులభమవడంతో పాటు ప్రజల సమస్యలపై వేగంగా స్పందించే అవకాశం ఉంటుందని విజయ్ ప్రభుత్వం చెబుతోంది. అధికారిక పనులకు అవసరమైన సదుపాయాలు కల్పించడం ద్వారా పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా పాలన సాగించవచ్చన్నది ప్రభుత్వ వాదన.
అయితే ఎమ్మెల్యేలకు వాహనాలు, భత్యాలపై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. 234 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వాహనాలు, నిర్వహణ, డ్రైవర్, సహాయకుల ఖర్చులు రాష్ట్ర ఖజానాపై అదనపు భారం అవుతాయని ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. గత ప్రభుత్వాలు ఆర్థిక పరిమితుల కారణంగా ఇలాంటి డిమాండ్లను పక్కన పెట్టాయని ఓ డీఎంకే ఎమ్మెల్యే సభలోనే ప్రస్తావించారు.
వైద్య విద్యకు రూ.351 కోట్లు
ఎమ్మెల్యేల సదుపాయాల ప్రకటనతో పాటు వైద్య రంగంలోనూ విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశ సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.351 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపింది. దీని ద్వారా మొత్తం 6,098 అదనపు సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
వీటిలో బీఎస్సీ నర్సింగ్‌లో 660, నర్సింగ్ కళాశాలలు, పాఠశాలల్లో 1,925, 12 పారామెడికల్ కోర్సుల్లో 2,778, వైద్య కోర్సుల్లో 735 అదనపు సీట్లు ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలో ఏడు కొత్త ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు.
పెరంబలూరులో ఆసుపత్రి
పెరంబలూరులో రూ.300 కోట్ల అంచనా వ్యయంతో 400 పడకల మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అత్యాధునిక వైద్య సేవలను అందించేలా ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేయనున్నారు.
ఆరోగ్య బీమా పరిమితి రూ.25 లక్షలకు
ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం కింద ప్రస్తుతం ఉన్న వార్షిక చికిత్స పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఖరీదైన వైద్య చికిత్సలు అవసరమైన కుటుంబాలకు మరింత ఆర్థిక భరోసా లభించే అవకాశం ఉంది.
అదే సమయంలో ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు అదనపు వైద్య, శస్త్రచికిత్స సేవలను కూడా పథకం పరిధిలోకి తీసుకురానున్నారు. చెన్నై స్టాన్లీతో పాటు తిరునెల్వేలి, తూత్తుకుడి, చెంగల్పట్టు, తిరువారూర్, కరూర్, కన్యాకుమారి ఆసుపత్రుల్లో ఈ సేవలను అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
జీతం ఫ్లస్..
తమిళనాడు ఎమ్మెల్యేలకు ఒకప్పుడు రూ.55 వేల నెలవారీ వేతనం ఉండేది. 2017లో అప్పటి ప్రభుత్వం అలవెన్సులన్నీ కలిపి రూ.1.05 లక్షలకు పెంచింది. ఇందులో ప్రాథమిక వేతనం రూ.30 వేలు, నియోజకవర్గ అలవెన్స్ రూ.25 వేలు, టెలిఫోన్ అలవెన్స్ రూ.7,500, ఇతర అలవెన్సులు ఉన్నాయి. ఇక ముఖ్యమంత్రికి వేతనం సుమారు రూ.2.05 లక్షల దాకా ఉంది. విజయ్ సర్కార్ ఇప్పుడు ఆ వేతనానికి అదనంగా.. కారు+డ్రైవర్+పీఏ జీతం కోసం లక్ష అదనంగా చెల్లించనుంది.


