భోపాల్: ఇటీవల కాలంలో జెన్-జీ ఉద్యమం దేశవ్యాప్తంగా ఎంత ప్రాముఖ్యత సంపాదించిందో తెలిసిందే. నీట్ పేపర్ లీకేజ్‌కు వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామాతో ముగిసింది. అయితే జెన్-జీ యువతకున్న పవరేంటో ఈ ప్రొటెస్ట్‌తో దేశం మెుత్తం తెలిసింది. కాగా ఇప్పుడు తాజాగా వారి తర్వాత తరం జెన్ అల్పా ఉద్యమ బాట పట్టారు. భోపాల్‌లోని తమ స్కూల్ విలీనానికి నిరసనగా రోడ్లెక్కారు.
భోపాల్‌లోని రీజినల్ స్కూల్ ‘జెన్ ఆల్ఫా’ ఈ రోజు (బుధవారం) విద్యార్థులు నిరసనకు దిగారు. డెమాన్‌స్ట్రేషన్ మల్టీపర్పస్ స్కూల్ (DMS)లను కేంద్రీయ విద్యాలయ సంగఠన్ (KVS)లో విలీనం చేయాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విలీనంతో తమ విద్యాసంస్థకు ఉన్న ప్రత్యేక గుర్తింపు, విద్యా ప్రయోగాల లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
DMS స్కూల్స్ అంటే ఏమిటి?
డెమాన్‌స్ట్రేషన్ మల్టీపర్పస్ స్కూల్స్‌ను రీజినల్ స్కూల్స్‌గానూ పిలుస్తారు. ఇవి 1965 డిసెంబర్ నుంచి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. భోపాల్, అజ్మీర్, మైసూరు, భువనేశ్వర్ నగరాల్లో ఈ ప్రయోగాత్మక పాఠశాలలను ఏర్పాటు చేశారు. కొత్త బోధనా పద్ధతులను అభివృద్ధి చేయడం, విద్యారంగంలో వినూత్న విధానాలను ప్రయోగించడం, వాటి ఫలితాలను పరిశీలించడం ఈ పాఠశాలల ప్రధాన ఉద్దేశంగా ఉంది.
ఈ పాఠశాలలను KVSలో విలీనం చేయడం వల్ల వాటి ప్రత్యేక విద్యా విధానం, ప్రయోగాత్మక స్వభావం దెబ్బతినే ప్రమాదం ఉందని విద్యార్థులు, పాఠశాలతో సంబంధం ఉన్న సభ్యులు పేర్కొన్నారు. పరిపాలనా వ్యవస్థ మారితే విద్యా ప్రయోగాలు, పరిశోధనలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. నిరసన అనంతరం విద్యార్థులు తమ అభ్యంతరాలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రీజినల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్.కే. గుప్తాకు సమర్పించారు. విలీన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు.
తమ డిమాండ్లపై అధికారులు త్వరగా స్పందించకపోతే ఆందోళనను దశలవారీగా తీవ్రతరం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. శాంతియుత నిరసనలు కొనసాగించడంతో పాటు సంబంధిత అధికారులు, శాఖల దృష్టికి తమ సమస్యను తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ప్రయోగాత్మక విద్యా కేంద్రాలుగా ఉన్న ఈ సంస్థలను మరింత బలోపేతం చేయాలని, వాటి అసలు లక్ష్యాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. భోపాల్‌లో ప్రారంభమైన ఈ నిరసన.. రీజినల్ స్కూల్స్‌ను KVSలో విలీనం చేసే ప్రతిపాదనపై విద్యార్థుల నుంచి వస్తున్న తొలి బహిరంగ వ్యతిరేకతగా నిలిచింది.
भोपाल में ‘Gen Alpha Protest’! Regional School को केंद्रीय विद्यालय में मर्ज करने के प्रस्ताव के खिलाफ 300 से ज्यादा छात्र सड़क पर उतरे, बोले—“Save DMS” #GenAlpha #Bhopal #KhabarMirror pic.twitter.com/e7F4rH4sWY
— Khabar Mirror (@KhabarMirror) August 19, 2026


