డీఎస్సీపై చర్చకు వైఎస్సార్‌సీపీ పట్టు
సహనం కోల్పోయి చైర్మన్‌నే ఆదేశిస్తూ మంత్రుల వ్యాఖ్యలు
సభలో మంత్రుల తీరుపై బొత్స మండిపాటు
డిప్యూటీ చైర్మన్ ఎన్నిక టైంలోనూ దుస్పంప్రదాయం
సభా సంప్రదాయాలను అధికార పక్షం తుంగలో తొక్కిందని ధ్వజం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో అధికార కూటమి సభ్యులు, మంత్రుల తీరుపై వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా సంప్రదాయాలను అధికార పక్షం తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ సభ్యులు డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై చర్చకు పట్టుబడుతుండగా.. సమాధానం చెప్పలేక మంత్రులు అసహనంతో వ్యవహరిస్తున్నారన్నారు. చివరకు సభను ఎలా నిర్వహించాలో చైర్మన్‌కే సూచనలు చేసే స్థాయికి మంత్రుల తీరు వెళ్లిందని ధ్వజమెత్తారు.
బుధవారం శాసన మండలిలో.. డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, దీనిపై సమగ్రంగా చర్చించాల్సిందేనని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. దీనిపై వాయిదా తీర్మానం ఇచ్చినా చైర్మన్ అనుమతించకపోవడంతో సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. డీఎస్సీ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిబంధనలు ఒక్కరికే కాకుండా అందరికీ సమానంగా వర్తించాలని బొత్స పేర్కొన్నారు.
ప్రశ్నలకు సమాధానం చెప్పలేక..
వైఎస్సార్‌సీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కూటమి మంత్రులు గట్టిగా మాట్లాడటం, అసహనం వ్యక్తం చేయడం సరికాదని బొత్స అన్నారు. సభలో మంత్రుల తీరు చూస్తుంటే ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి లేకపోవడం స్పష్టమవుతోందని విమర్శించారు. సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. ప్రతిపక్ష సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తోందని మండిపడ్డారు.

చైర్మన్‌నే ఆదేశిస్తారా?
సభను నిర్వహించే విషయంలో మంత్రులు చైర్మన్ కొయ్యే మోషేనురాజుపై అసహనం వ్యక్తం చేయడాన్ని బొత్స తప్పుబట్టారు. “మండలిని ఎలా నిర్వహించాలో మీకు తెలియదా?” అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు మంత్రి పార్థసారథి వైఎస్సార్‌సీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారని పేర్కొన్నారు. మంత్రుల వ్యాఖ్యలపై చైర్మన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారని బొత్స తెలిపారు. సభను ఎలా నడపాలో తనకు చెప్పాల్సిన అవసరం లేదంటూ చైర్మన్ మంత్రులకు స్పష్టం చేయడం.. అధికార పక్షం వ్యవహారశైలికి అద్దం పడుతోందన్నారు.
చైర్మన్ సీటును గౌరవించాలి
చైర్మన్ స్థానాన్ని మంత్రులు గౌరవించాల్సి ఉంటుందని బొత్స హితవు పలికారు. నాదెండ్ల మనోహర్ వ్యవహారశైలిని తాను చాలాసార్లు గమనించానని.. ఆయన చైర్మన్ పట్ల వ్యవహరించిన తీరు సరికాదన్నారు. ప్రొసీజర్ బుక్ తీసుకొచ్చి తానేమీ తప్పుగా మాట్లాడలేదని నాదెండ్ల సమర్థించుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదని అన్నారు. పొరపాటు జరిగితే చెప్పాలి కానీ.. చైర్మన్‌కే హితబోధ చేసేలా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు.
కూటమి ఎమ్మెల్సీల తీరుపైనా..
మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలో అధికార కూటమి సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోవడాన్ని కూడా బొత్స తప్పుబట్టారు. సభలో అధికార పార్టీ సభ్యులు లేకపోవడం సరికాదని, ఇది శాసనసభా సంప్రదాయాలను అగౌరవపరచడమేనని అన్నారు. డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన తూమాటి మాధవరావుకు బొత్స అభినందనలు తెలిపారు.

“మండలిలో వెన్నుపోటు పార్టీ నేతల తీరు బాధాకరం. ఆ పార్టీ వైఖరి మరోసారి బయటపడింది. అధికార పార్టీ సభ్యులు సభను గౌరవించలేదు.. అగౌరవపరిచారు. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నికల సమయంలో అధికార పక్షం లేకపోవడం దురదృష్టకరం. రాష్ట్ర చరిత్రలో ఎన్నాడూ ఇలా జరగలేదు” అని బొత్స విమర్శించారు. ‘‘అధికార పక్షానికి అహంకరం పనికి కాదు. డిప్యూటీ చైర్మన్‌కు గౌరవం ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు. నీతులు చెప్పడమేనా? పాటించడం తెలియదా?. కూటమి సభ్యులు చరిత్ర హీనులుగా నిలిచిపోతారు’’ మరో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు.
ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుంది
ప్రభుత్వం ఎంత దూరం పారిపోయినా ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని బొత్స స్పష్టం చేశారు. డీఎస్సీ అంశంతో పాటు అన్ని ప్రజా సమస్యలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అధికార పక్షం ఇప్పటికైనా అహంకార వైఖరిని విడనాడి ప్రతిపక్షం లేవనెత్తే అంశాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


