
సాక్షి, న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల అయ్యింది. సెప్టెంబర్ 9వ తేదీన ఎన్నిక జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జగ్దీప్ ధన్‌ఖడ్ అనూహ్య రాజీనామాతో ఈ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే.
ఆగస్టు 7వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కానుంది. నామినేషన్ల స్వీకరణకు ఆగస్టు 21వ తేదీ ఆఖరు. నామినేషన్ పరిశీలన 22వ తేదీన జరుగుతుంది. ఆగస్టు 25వ తేదీలోపు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం 10గం. నుంచి సాయంత్రం 5గం. దాకా పోలింగ్ జరుగుతుంది. అదే రోజు కౌంటింగ్ జరగనుంది.
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం నిర్వహించబడే ఒక ప్రత్యేక ఎన్నిక. రాష్ట్రపతి ఎన్నికలతో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటుంది. ఈ ఎన్నికలో ఎలక్టోరల్ కాలేజీ తరఫున లోక్‌సభ, రాజ్యసభకు ఎన్నికైన, నామినేట్ అయిన సభ్యులు మాత్రమే ఓటు వేస్తారు. రాష్ట్ర శాసనసభ సభ్యులకు ఓటు హక్కు ఉండదు.
పరోక్ష ఓటింగ్ (Indirect Election).. ఏక బదిలీ ఓటు పద్ధతి.. ఓటర్లు ఎన్నికలో నిల్చున్న అభ్యర్థులను ప్రాధాన్యత క్రమంలో (1, 2, 3...) గుర్తిస్తారు. రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరుగుతుంది
అర్హతలు
భారతీయ పౌరుడై ఉండాలి
కనీసం 35 సంవత్సరాల వయస్సు
రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యే అర్హత ఉండాలి
లాభదాయక పదవిలో ఉండకూడదు
రిటర్నింగ్ అధికారిగా.. లోక్‌సభ లేదంటే రాజ్యసభ సెక్రటరీ జనరల్ రొటేషన్ పద్ధతిలో నియమించబడతారు
నామినేషన్, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్, లెక్కింపు — మొత్తం ప్రక్రియను 32 రోజుల్లో పూర్తి చేయాలని ఆర్టికల్ 66 స్పష్టం చేస్తోంది.