ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హిందీ చలన చిత్ర పరిశ్రమలో తనకు అవకాశాలు తగ్గడానికి మతం కూడా ఓ కారణం అయ్యి ఉండొచ్చని అన్నారాయన. దీనిపై బాలీవుడ్‌లో తీవ్ర చర్చ నడుస్తోంది. పలువురు సినీ ప్రముఖులు రెహమాన్ కామెంట్లను ఖండిస్తున్నారు. ఈ క్రమంలో.. విశ్వహిందూ పరిషత్ ఓ అడుగు ముందుకేసి ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించింది.
అవకాశాలు ఎందుకు దొరకడం లేదో రెహమాన్ ఆత్మపరిశీలన చేసుకోకుండా.. మొత్తం సినీ పరిశ్రమను నిందించడం సరికాదని వీహెచ్‌పీ జాతీయ ప్రతినిధి వినోద్ బన్సాల్ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు హిందువుగానే ఉన్న రెహమాన్ ఇలాంటి వ్యాఖ్యలతో ఏం నిరూపించాలనుకుంటున్నారు?" అని ఆయన ప్రశ్నించారు. బాలీవుడ్‌లో అవకాశాలు దక్కాలంటే ఘర్‌వాపసీ కావాలంటూ వ్యాఖ్యానించారు.
.. హమీద్ అన్సారీ(మాజీ ఉపరాష్ట్రపతి)కి చెందిన వర్గానికే ఇప్పుడు రెహమాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడేమో. గతంలో అన్సారీ కూడా 10 ఏళ్ల పాటు రాజ్యాంగ బద్ధమైన వివిధ పదవులను అనుభవించారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన దేశాన్ని దెబ్బ తీశారు. ఒకప్పుడు అతను(రెహమాన్‌ను ఉద్దేశిస్తూ..)ను హిందువులతో సహా దేశం మొత్తం ఆరాధించింది. అలాంటి వ్యక్తి ఎందుకు మతం మారాడు?. బహుశా ఘర్‌వాపసీ అయితే మళ్లీ అవకాశాలు వస్తాయేమో అని బన్సాల్ అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ నేతలకు సరిపోతాయని.. రెహమాన్‌లాంటి ఆర్టిస్టులకు కాదని చురక అంటించారు.
ఓ ప్రముఖ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్లుగా హిందీ చిత్ర పరిశ్రమలో తనకు అవకాశాలు తగ్గాయన్నారు. ఇండస్ట్రీలో మారిన 'పవర్ షిఫ్ట్' ఇందుకు ఒక కారణమైతే.. 'మతం' కూడా మరో కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయాలను తనకు పుకార్ల రూపంలోనే తెలిశాయని అన్నారు. అయితే.. అవుట్‌సైడర్‌లా తాను ఫీలైనప్పటికీ.. కొన్ని ప్రాజెక్టులు చేజారినప్పటికీ.. కుటుంబంతో గడిపే సమయం ఎక్కువగా దొరుకుతోందని అన్నారు. పని కోసం నేను వెతుక్కుంటూ వెళ్లడం కాదు.. నా నిజాయితీకి తగ్గట్లు పని వస్తే సంతోషిస్తానని చెప్పారు.
మరోవైపు, రెహమాన్ వ్యాఖ్యలను సినీ పరిశ్రమలోని పెద్దలు విభేధిస్తున్నారు. ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ స్పందిస్తూ.. హిందీ పరిశ్రమలో మతపరమైన వివక్ష లేదని, దిలీప్ కుమార్ (యూసుఫ్ ఖాన్), షారుఖ్ ఖాన్ వంటి ఎందరో కళాకారులు అగ్రస్థానంలో కొనసాగారని గుర్తుచేశారు. మరో ఫిల్మ్‌మేకర్ రెహమాన్ వ్యాఖ్యలను చీప్ అని పేర్కొన్నారు.
అయితే.. రెహమాన్ సంగీతంలో మునుపటి జోష్ కనిపించడం లేదని.. భారీగా రెమ్యునరేషన్ అడుగుతున్నారని.. వీటికి తోడు ఆలస్యంగా పాటలు ఇవ్వడం వల్లే అవకాశాల్లేకుండా పోయాయని పలు సినిమాల పేర్లను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.


