సెంట్ర‌ల్ జైల్లో రౌడీ బ‌ర్త్‌డే.. వీడియో వైర‌ల్‌ | Undertrial Prisoner Celebrates Birthday Inside Bengaluru Central Jail, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

సెంట్ర‌ల్ జైల్లో బ‌ర్త్‌డే చేసుకున్న రౌడీషీట‌ర్‌

Oct 6 2025 2:34 PM | Updated on Oct 6 2025 3:18 PM

Undertrial Prisoner Celebrates Birthday Inside Bengaluru Central Jail

సెంట్ర‌ల్ జైలు అంటే ఎంత సెక్యురిటీ ఉంటుందో అంద‌రికీ తెలిసింది. కారాగారంలో ఉన్న‌వారిని క‌ల‌వాలంటే చాలా త‌తంగం ఉంటుంది. ఏదైనా తీసుకెళ్లాల‌న్న కూడా చాలా రూల్స్ ఉంటాయి. అలాంటిది సెంట్ర‌ల్ జైలులో ఏకంగా ఓ రౌడీ త‌న అనుచ‌రుల‌తో క‌లిసి బ‌ర్త్ డే సెల‌బ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో జైలు అధికారులు దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇదంతా ఎలా జ‌రిగిందో విచార‌ణ చేప‌డ‌తామ‌ని చెబుతున్నారు.

బెంగళూరు పరప్పణ‌ అగ్రహార సెంట్రల్ జైలులో ఈ ఘ‌ట‌న వెలుగు చూసింది. అండ‌ర్ ట్రయల్ ఖైదీగా ఉన్న రౌడీ షీటర్ శ్రీనివాస అలియాస్ గుబ్బచ్చి సీనా (Gubbachhi Seena) కేక్‌ను కట్ చేసి పుట్టిన‌రోజు జ‌రుపుకున్నాడు. అత‌డు కేక్ కట్ చేస్తుండగా చుట్టూ ఉన్న‌వారు చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తూ కనిపించారు. ఆపిల్ పండ్ల‌తో త‌యారు చేసిన దండ‌ను అత‌డి మెడ‌లో వేశారు. ఈ వీడియోను ఒక ఖైదీ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. 50 సెకన్ల నిడివి గల ఈ వీడియో క్లిప్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో తీవ్ర‌ క‌ల‌క‌లం రేగింది.

వీడియో ఎలా తీశారు?
జైలులో రౌడీషీట‌ర్ బ‌ర్త్ డే చేసుకోవ‌డ‌మే కాకుండా, దాన్ని సెల్‌ఫోన్‌లో వీడియో కూడా తీయ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. జైలు అధికారుల ప‌నితీరుపై ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. అంతేకాదు కారాగారం లోప‌ల‌వున్న త‌మ వారి భ‌ద్ర‌త‌పై ఖైదీల కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న చెందుతున్నారు. కాగా, ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జైలు నిబంధనల ప్రకారం మొబైల్ ఫోన్లకు అనుమ‌తి లేదు. ఖైదీ వీడియోను ఎలా రికార్డ్ చేయగలడనే దానిపై కూడా వారు కూపీ లాగుతున్నారు.

ఎవ‌రీ సీనా?
రౌడీ షీటర్ శ్రీనివాస త‌న ప్ర‌త్య‌ర్థి హ‌త్య కేసులో ప్ర‌ధాన ముద్దాయిగా ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో బెంగళూరులోని దొడ్డ బొమ్మసంద్రలో తన ప్రత్యర్థి వెంకటేష్‌ను హత్య చేసినట్లు సీనాపై ఆరోపణలు ఉన్నాయి. ఫిబ్రవరిలో అత‌డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ స‌మ‌యంలో దొర‌క్కుండా త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా పోలీసులు కాల్పులు జ‌ర‌ప‌డంతో అత‌డి కాలికి గాయ‌మైంది.

భాస్క‌ర‌రావు ఫైర్‌
ఈ వ్య‌హహారంపై బెంగ‌ళూరు మాజీ పోలీసు క‌మిష‌న‌ర్‌, బీజేపీ నేత భాస్క‌ర‌రావు ఎక్స్‌లో స్పందించారు. 'కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. పరప్పణ‌ అగ్రహార జైలు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. జైలులోకి ఒక భారీ కేక్ ప్రవేశించింది. జైలులో ఉన్న మినీ రౌడీలతో క‌లిసి ఒక రౌడీ తన పుట్టినరోజును జరుపుకున్నాడు. అంతేకాదు దీన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. క‌ర్ణాట‌క‌లో పాలన కుప్పకూలిపోయింది. సీఎం, మంత్రులు ప‌ట్టించుకోవ‌డం లేదు. కాంట్రాక్టర్లు ఇప్పుడు అవినీతి గురించి బహిరంగంగా ఏడుస్తున్నారు. ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ యువత వీధుల్లోకి వచ్చారు. బెంగళూరు పరిపాలన గుంతలు, చెత్తతో చెత్తగా ఉంది. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జైలులో ఉన్నారు. శాంతిభ‌ద్ర‌త‌లు క్షీణించాయ‌'ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 

గ‌తంలోనూ.. 
పరప్పణ‌ అగ్రహార సెంట్రల్ జైలులో గ‌తంలోనూ ఇలాంటి ఘ‌ట‌న జరిగింది. 2020, డిసెంబ‌ర్‌లో రిజ్వాన్‌ అలియాస్ రౌడీ కుల్లా త‌న మ‌ద్ద‌తుదారుల‌తో కలిసి తన పుట్టినరోజును జరుపుకోవడమే కాక, దాన్నంతా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అటాచ్ చేసి మరీ సోషల్ మీడియలో పోస్ట్ చేశాడు. ఈ వ్య‌వ‌హారం అప్ప‌ట్లో విస్తృత చ‌ర్చ జ‌రిగింది. పోలీసులు ఎప్ప‌టిలాగానే స్పందించారు. ద‌ర్యాప్తు చేస్తామ‌ని ప్ర‌క‌టించి చేతులు దులుపుకున్నారు. పోలీసుల మెత‌క వైఖ‌రి కార‌ణంగానే ఇలాంటి ఘ‌ట‌న‌లు పునరావృతంఅవుతున్నాయ‌ని క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు అనుకుంటున్నారు. 

చ‌ద‌వండి: బెడ్‌రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి.. గ‌లీజు ప‌నులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement