ఈసీ, మోదీపై ఉద్ధవ్‌ థాక్రే సంచలన వ్యాఖ్యలు..

Uddhav Thackeray Attacks On Election Commission And PM Modi - Sakshi

ముంబై: మహారాష్ట్రలో మరోసారి రాజకీయం హీటెక్కింది. శివసేన అధికారిక విల్లు బాణం గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం.. షిండే వర్గానికే ఇవ్వడంతో మాజీ సీఎం ఉద్ధవ్‌ థాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం, ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ‘విల్లుబాణం’ను చోరీచేశారంటూ మహా సీఎం షిండేను ఉద్దేశించి ఆరోపణలు చేశారు. 

వివరాల ప్రకారం.. ఉద్ధవ్‌ థాక్రే నివాసం మాతోశ్రీ వద్ద మద్దతుదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉద్ధవ్‌ థాక్రే మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్‌.. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోంది. కొందరి పక్షాన మద్దతుగా నిలుస్తోంది. ఎన్నికల సంఘం ఇంతకు ముందు ఎప్పుడూ చేయని విధంగా పనిచేస్తోంది. అయినా మనం చింతిచాల్సిన అవసరం లేదు. ఓపిక పట్టండి రానున్న రోజులున్నీ మనవే. రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అని పిలుపునిచ్చారు. 

ఇదే సమయంలో షిండే వర్గంపై నిప్పులు చెరిగారు. శివసేన గుర్తు విల్లు-బాణం’ను చోరీ చేశారు. ఈ క్రమంలో నిందితుడికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. మేము దీన్ని మండే కాగడాతో ఎదుర్కొంటాము అని కామెంట్స్‌ చేశారు. ఇక, ఉద్దవ్‌ థాక్రే ప్రసంగిస్తున్న సందర్బంగా మద్దతుదారులు మాతోశ్రీ వద్ద పెద్ద సంఖ్యలో గుమ్మిగూడారు. ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం శివసేన ఉద్ధవ్‌ థాక్రే వర్గానికి కాగడా ఎన్నికల గుర్తుగా ఉన్న విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఎన్నికల సంఘం.. ఈ గుర్తును కేటాయించింది. కాగా, పుణే జిల్లాలోని కస్బాపేట్‌, చించ్‌వాడ్‌ ఉప ఎన్నికల వరకు ఉద్ధవ్‌ వర్గానికి ఈ కాగడా గుర్తు ఉంటుందని ఈసీ పేర్కొంది. ఈ స్థానాలకు ఫిబ్రవరి 26వ తేదీన ఉప ఎన్నికలు జరుగనున్నాయి. మరోవైపు.. విల్లుబాణం గుర్తును తమకు కేటాయించడంపై సీఎం షిండే స్పందించారు.  ఇది.. ప్రజాస్వామ్య విజయం అంటూ కామెంట్స్‌ చేశారు. ఉద్ధవ్‌ థాక్రే ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యలు చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top