ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి పాపారావు అలియాస్ చంద్రయ్య అలియాస్ మంగు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన మావోయిస్టు వర్గాల్లోనే కాకుండా భద్రతా బలగాల్లోనూ కీలక పరిణామంగా మారింది.
సుక్మా జిల్లా కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిమ్మలగూడెం గ్రామానికి చెందిన సున్నం చంద్రయ్య (56) గత మూడు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషించాడు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న చంద్రయ్య , బస్తర్ ప్రాంతంలో మిగిలి ఉన్న అగ్రనేతల్లో అత్యంత కీలక నేతగా పేరొందాడు. పాపారావుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.50 లక్షల రివార్డు ప్రకటించాయి. అతడిని మట్టు పెట్టేందుకు భద్రతా బలగాలు గత కొంతకాలంగా ప్రత్యేక ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి. మార్చి 2026 నాటికి పాపారావును నిర్వీర్యం చేస్తామని లక్ష్యంగా పెట్టుకున్న బలగాలు, ఆ గడువు కంటే రెండు నెలల ముందే విజయం సాధించాయి.
పాపారావు తన ఫోటో కూడా భద్రతా బలగాలకు చిక్కకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించిన నేతగా గుర్తింపు పొందాడు. నేటికీ పోలీసుల వద్ద ఉన్నది ఏదో ఒక పాత ఫోటో మాత్రమేనని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది జనవరి 6న కుట్రు–బెద్రే రహదారిపై భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీ బాంబుతో పేల్చిన ఘటనలో పాపారావు కీలక సూత్రధారి, మాస్టర్‌మైండ్‌గా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆ దాడిలో ఎనిమిది మంది జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా, ఒక ప్రైవేట్ డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఎన్‌కౌంటర్‌తో బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.


