
బెంగాల్‌ను కేంద్రం లక్ష్యంగా చేసుకుందంటూ ఆరోపణలు
కోల్‌కతా: బిహార్‌లోని యువ ఓటర్లకు ఓటు లేకుండా చేసేందుకే ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్)కు పూనుకుందని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. బిహార్ తర్వాత ఈసీ తదుపరి లక్ష్యం 2026లో ఎన్నికలు జరిగే బెంగాల్ అని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చర్యకు నిరసనగా ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లోని నిబంధనలు ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950కి విరుద్ధంగా ఉన్నాయి మహువా పేర్కొన్నారు.
వివిధ పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నందున ఈసీ ఎస్‌ఐఆర్‌ను నిలిపివేయాలని సూచించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించినట్లు వివరించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఆదేశాలను ఈసీ జారీ చేయకుండా చూడాలని కోరానన్నారు. 1987 జూలై 1–2004 డిసెంబర్ 2వ తేదీల మధ్య జని్మంచిన వారు ఈసీ చేపట్టిన ఎస్‌ఐఆర్ కారణంగా ఓటేసే హక్కుకు లక్షలాది మంది దూరమవుతారని ఆరోపించారు.
బిహార్‌లో ఎస్‌ఐఆర్‌ను అమలు చేయాలంటూ ఈసీ జూన్ 24వ తేదీన ఆదేశాలు జారీ చేయడం తెల్సిందే. అనర్హులను జాబితా నుంచి తొలగించడం, అర్హులైన పౌరుల పేర్లు జాబితాలో ఉండేలా చూడటమే ఈ ఆదేశాల లక్ష్యమని ఈసీ అంటోంది. ఈసీ ఆదేశాలపై ఏడీఆర్, పీయూసీఎల్ వంటి పౌర సంఘాలు, కార్యకర్తలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. అయితే, బిహార్‌లో ఎస్‌ఐఆర్ అమలుకు సంబంధించి తాము జారీ చేసిన ఆదేశాల్లో ఎలాంటి మార్పూ లేదని ఈసీ ఆదివారం స్పష్టం చేసింది.