
మోరెనా : మధ్యప్రదేశ్‌లో మరో అత్యంత దారుణ పరువు హత్య వెలుగు చూసింది. ఉన్నత కులానికి చెందిన 17 ఏళ్ల యువతి.. వెనుకబడిన కులానికి చెందిన యువకునితో స్నేహం చేసిందని ఆరోపిస్తూ, ఆ యువతి కుటుంబీకులు అత్యంత దారుణానికి పాల్పడ్డారు. యువతి మృతదేహం అనుమానాస్పద స్థితిలో నదిలో పోలీసులకు కనిపించిన దరమిలా ఈ ఉదంతం వెలుగు చూసింది.
బాధితురాలిని 17 ఏళ్ల దివ్య సికార్వర్‌గా, ఆమె మోరెనా జిల్లాకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. 12వ తరగతి చదువుతున్న దివ్య శనివారం నుంచి కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, దివ్య మృతదేహం ఒక నదిలో కనిపించింది. ఆమె తండ్రి భరత్ సికార్వర్ కుమార్తె మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి, దానిని రాయికి కట్టి, వారి ఇంటికి 30 కి.మీ దూరంలో ఉన్న కున్వారీ నదిలో విసిరేశాడని పోలీసుల విచారణలో తేలింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దివ్య ఉన్నత కులానికి చెందినది. అయితే ఆమె వెనుకబడిన కులానికి చెందిన యువకుడితో స్నేహం చేస్తూ వచ్చింది. దీంతో ఆ అగ్రకులానికి చెందినవారు దివ్య కుటుంబ సభ్యులను రెచ్చగొట్టి, ఆ యువకుని హత్యకు పురిగొల్పివుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తొలుత పోలీసుల విచారణలో మృతురాలి తల్లిదండ్రులు విరుద్ధమైన సమాధానాలిచ్చారు. దివ్య విద్యుత్ షాక్ కారణంగా మరణించిందని చెప్పారు. తరువాత ఆత్మహత్య చేసుకున్నదన్నారు. అయితే పాక్షికంగా కుళ్లిపోయిన ఆమె శరీరాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు, మృతురాలి తలపై తుపాకీతో కాల్చిన గాయం ఉందని గుర్తించారు.
అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సురేంద్ర పాల్ సింగ్ దబార్ మీడియాతో మాట్లాడుతూ.. దివ్య మృతదేహాన్ని కున్వారీ నది నుండి వెలికితీసి, పోస్ట్‌మార్టం కోసం పంపామని, ఫోరెన్సిక్ నివేదిక తర్వాత మాత్రమే మరణానికి గల కారణాన్ని నిర్ధారించగలమన్నారు. మృతురాలి తండ్రి భరత్ సికార్వార్ మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా గాయపడిన తన కుమార్తెను ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మరణించిందని, దీంతో భయపడి తాను మృతదేహాన్ని నదిలో పారవేశానని తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.