ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో టీచర్ల వేధింపులు భరించలేక విద్యార్థి శౌర్య పాటిల్ (16) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో వారిపై చర్యలు తీసుకోవాలని సూసైడ్ నోట్‌లో విజ్ఞప్తి చేశాడు. దీంతో, హెడ్ మాస్టర్ సహా మరో నలుగురు సిబ్బందిని స్కూల్ యాజమాన్యం విధుల నుంచి తప్పించింది. అయితే, సస్పెన్షన్‌కు ముందు శౌర్య ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి పాఠశాలలో పరిస్థితులను అంచనా వేయడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ విద్యా శాఖ అధికారులు తెలిపారు.
మరోవైపు.. శౌర్య పాటిల్ తండ్రి ప్రదీప్ పాటిల్ తాజాగా మాట్లాడుతూ..‘నా బిడ్డను టీచర్లే బలి తీసుకున్నారు. వారిని కేవలం సస్పెండ్ చేస్తే సరిపోదు. సస్పెన్షన్ తాత్కాలికం మాత్రమే. ఎఫ్‌ఐఆర్‌లో వారి పేర్లను చేర్చి ఉపాధ్యాయులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నా. మరికొద్ది రోజుల్లోనే మా అబ్బాయిని వేరే పాఠశాలకు పంపించేందుకు సిద్ధమయ్యాం. ఈ విషయాన్ని శౌర్యకు కూడా చెప్పడంతో సరే అన్నాడు. కానీ, పాఠశాల నుంచి మేము వెళ్లిపోతున్నామనే కారణంతో టీచర్లు ఇలా వేధింపులకు గురి చేశారు. వారి వేధింపుల కారణంగా కలత చెంది ఇలా చనిపోయాడు. ఇకపై పిల్లలతో ఏ ఉపాధ్యాయుడు అలా ప్రవర్తించకూడదనే సందేశాన్ని మనం పంపాలి అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా.. ఢిల్లీలోని సెయింట్ కొలంబాస్ పాఠశాలలో టీచర్ల వేధింపులు భరించలేక మెట్రో స్టేషన్ నుంచి దూకి పదో తరగతి విద్యార్థి శౌర్య పాటిల్(16) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా తన సూసైడ్ నోట్‌లో.. ‘అమ్మా నన్ను క్షమించు. స్కూల్ సిబ్బంది వేధింపులకే నేనీ పని చేస్తున్నా. మరణించాక నా అవయవాలు ఏమైనా పనికి వస్తే వాటిని అవసరమైన వారికి అమర్చండి. అమ్మా.. నీ హృదయాన్ని చాలాసార్లు బాధపెట్టా. ఇప్పుడు ఆఖరిసారిగా చేస్తున్నా’ అంటూ పేర్కొన్నాడు.
ఇక, విద్యార్థి ఆత్మహత్యపై రాజేంద్ర నగర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తులో భాగంగా పోలీసులు.. సదరు విద్యార్థి స్నేహితులు, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వాహకుల నుండి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. కాగా, విద్యార్థి ఆత్మహత్య ఘటన దేశ రాజధానిలో చర్చనీయాంశంగా మారింది.


