
బిహార్‌లో ఓటరు జాబితా సవరణ అంశంలో ఈసీకి స్పష్టంచేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బిహార్‌లో ఓటర్ల జాబితాలో సమూల ప్రక్షాళన ధ్యేయంగా జరుగుతున్న ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భారీ స్థాయిలో ఓట్లను తొలగిస్తే మాత్రం తాము కచి్చతంగా జోక్యంచేసుకుంటామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఓటర్ల గుర్తింపును తనిఖీచేసే ప్రక్రియలో ఆధార్ కార్డ్, ఓటర్ కార్డులను చేర్చాలన్న పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగీ్చల సుప్రీంకోర్టు ధర్మాసనం వాదోపవాదనలను ఆలకించింది. చట్టప్రకారం ఓటర్ల జాబితాలో సవరణలు, మార్పులు, చేర్పులు చేసే అసాధారణ అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది.
‘‘తమకు ఇప్పటికే ఓటు ఉందని తెలియజేస్తూ ఎనుమరేషన్ దరఖాస్తును 65 లక్షల మంది సమరి్పంచలేదు. అంతమాత్రం చేత వీళ్లందరి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తారా? వీళ్లంతా ఎవరో ఈసీకి తెలియదా?’’ అని పిటిషనర్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా తరఫున సీనియర్ న్యాయవాది కపిల్‌సిబల్ వాదించారు. దీంతో ధర్మాసనం జోక్యంచేసుకుంది. ‘‘
చట్టప్రకారం చర్యలు తీసుకునే అధికారం ఈసీకి ఉంది. ఓటరు ముసాయిదా జాబితాలో ఏవైనా తప్పులుంటే మా దృష్టికి తీసుకుని రండి. ముసాయిదాలో పేర్లు లేకపోవడం కారణంగా ఓట్లను కోల్పోతున్న ఒక 15 మందిని తీసుకొచ్చి మా ముందు నిలబెట్టండి. దరఖాస్తు ఇవ్వనంత మాత్రాన చనిపోయారని ఆ జాబితా నుంచి ఎవరి పేర్లయితే తీసేశారో వాళ్ల వివరాలు మాకు ఇవ్వండి. అలాగే దరఖాస్తు ఇవ్వని కారణంగా జాబితాలో పేరు గల్లంతైన వారి వివరాలూ సమర్పించండి’’ అని సిబల్‌కు ధర్మాసనం సూచించింది.