
ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కేసులో స్టే ఇచ్చేందుకు నిరాకరణ
మే 2న విచారణాధికారి ఎదుట హాజరు కావాలని ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: సినీనటుడు మంచు మోహన్‌బాబుకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2019 ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కేసులో విచారణ నుంచి తనకు మినహాయింపుతోపాటు స్టే ఇవ్వాలని కోరిన మోహన్‌బాబు పిటిషన్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
కేసు విచారణకు హాజరుకాకుండా స్టే ఇవ్వాలని మోహన్‌బాబు తరపు సీనియర్ న్యాయవాది నిఖిల్ గోయల్ కోరారు. అంతేగాక మే 2న ఈ కేసులో విచారణకు హాజరుకావాలని తమకు ఇచ్చిన నోటీసుపై స్టే విధించాలని కోరగా... శుక్రవారం విచారణాధికారి ముందు కచ్చితంగా హాజరు కావాలని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఆదేశించింది.
అనుమతి లేకుండా ధర్నా చేయడంతో..
2014 నుంచి 2019 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం తమ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించలేదని 2019 మార్చి 22న తిరుపతి–మదనపల్లె జాతీయ రహదారిపై విద్యార్థులతో కలిసి మోహన్‌బాబు కుటుంబం బైఠాయించింది.
ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. ముందస్తు అనుమతి తీసుకోకుండా ధర్నా చేయడంతో.. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద మోహన్‌బాబు, ఆయన కుమారులు విష్ణు, మనోజ్‌కుమార్, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల ఏఓ తులసినాయుడు, పీఆర్వో సతీష్ౖపె చంద్రగిరి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో స్టే కోరుతూ మోహన్‌బాబు సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. దీనిపై బుధవారం వాదనలు జరిగాయి. స్టే ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది.