పేకాట సిగ్గుమాలిన పని కాదు | Supreme Court Says Playing Cards Without Gambling Is Not Moral Turpitude | Sakshi
Sakshi News home page

పేకాట సిగ్గుమాలిన పని కాదు

May 26 2025 6:08 AM | Updated on May 26 2025 6:08 AM

Supreme Court Says Playing Cards Without Gambling Is Not Moral Turpitude

జూదంలో భాగంగా ఆడితేనే తప్పు

గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌లా ఆడితే నేరమే

స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: పేకాట ఆడటం సిగ్గుమాలిన పని కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. జూదం, గ్యాంబ్లింగ్‌లో భాగంగా పేకాట ఆడితే మాత్రం నేరమని స్పష్టంచేసింది. ఎలాంటి గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌తో సంబంధం లేకుండా, ఎలాంటి మోసంతో ప్రమేయం లేకుండా కేవలం వ్యక్తిగతంగా, సొంత వాళ్లతో సరదాగా ఆడితే తప్పుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 

రోడ్డు పక్కన ఆటవిడుపుగా పేకాట ఆడాడన్న కారణంతో కర్ణాటకలో ఎంప్లాయీస్‌ హౌసింగ్‌ సొసైటీ బోర్డ్‌లో డైరెక్టర్‌ సభ్యత్వానికి దూరం చేయడం సబబుకాదని జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. కర్ణాటకలో గవర్నమెంట్‌ పోర్సలిన్‌ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్‌ హౌసింగ్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీలో వైసీ హనుమంతరాయప్ప ఎన్నికల్లో అత్యధిక ఓట్లు గెలిచి బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌లో సభ్యత్వం సాధించారు. 

అయితే రోడ్డుపక్కన పేకాట ఆడారన్న కారణంగా ఆయనపై రూ.200 జరిమానా వేసి, సభ్యత్వాన్ని రద్దుచేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా బోర్డు నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు వచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టగా మే 14వ తేదీన ఆయనకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. హౌసింగ్‌ సొసైటీలో ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలంటూ తీర్పు వెలువర్చింది. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేసింది. 

‘‘ పేకాట అనేది నైతికంగా తప్పు కాదు. బెట్టింగ్, జూదం, గ్యాంబ్లింగ్‌లో భాగంగా ఆడితేనే నేరం. సరదాకి సొంత వాళ్లతో ఆడితే దానిని నేరంగా భావించొద్దు. ఈ కేసులో నిందితుడు హనుమంతరాయప్ప పేకాటకు బానిస కాదు. గ్యాంబ్లింగ్‌ చేయలేదు. కేవ లం విరామం, విశ్రాంతి వేళ మానసిక ప్రశాంతత కోసం పేకాట ఆడారు. 2020 ఫిబ్రవరి 12న జరిగిన ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించి డైరెక్టర్ల మండలిలో స్థానం సంపాదించిన ఈయనను పేకాట ఆడాడన్న ఒకే ఒక్క కారణం చూపి శిక్షించడం సహేతుకం అనిపించుకోదు’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.  
 

Advertisement
 
Advertisement
Advertisement