రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందే
ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
ఎనిమిది వారాల గడువు ఇవ్వాలన్న వినతిని తోసిపుచ్చిన ధర్మాసనం
స్పీకర్ తీరు కోర్టు ధిక్కరణేనంటూ వాదించిన కౌశిక్‌రెడ్డి, కేటీఆర్ తరఫు లాయర్లు
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో చివరి ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్ల విచారణను అసెంబ్లీ స్పీకర్ ఇంకా ముగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే చివరి అవకాశమని.. మిగిలిన అనర్హత పిటిషన్లపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనంటూ అల్టి మేటం జారీ చేసింది.
ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి 8 వారాల గడువు ఇవ్వాలంటూ స్పీకర్ కార్యాలయం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. స్పీకర్ తీసుకోబోయే నిర్ణయాలతోపాటు ఇప్పటివరకు జరిగిన పురోగతిపై తదుపరి విచారణ నాటికి నివేదిక సమరి్పంచాలని స్పష్టం చేసింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఇరుపక్షాలు వాడీవేడిగా మిగతా వాదనలు వినిపించాయి.
గడువు కోరిన ప్రభుత్వ న్యాయవాదులు
బీఆర్‌ఎస్ నేతలు తమ పిటిషన్లలో ప్రతివాదులుగా పేర్కొన్న తెలంగాణ ప్రభుత్వం, స్పీకర్ కార్యాలయం తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, అభిõÙక్ మను సింఘ్వీ, నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘స్పీకర్ కంటి శస్త్రచికిత్స చేయించుకున్నారు. రెండు రోజులపాటు ఆస్పత్రిలో ఉన్నారు. అలాగే అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కూడా మారారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అందువల్ల పిటిషన్ల విచారణలో జాప్యం జరిగింది. ఇప్పటికే కొన్ని అంశాలను పరిష్కరించాం. మరికొన్నింటిపై తీర్పును రిజర్వ్ చేశాం. మిగిలిన వాటిని పూర్తి చేయడానికి మరో 8 వారాల సమయం ఇవ్వండి’అని ముకుల్ రోహత్గీ ధర్మాసనాన్ని కోరారు.
కావాలనే జాప్యం చేస్తున్నారు: బీఆర్‌ఎస్ తరఫు లాయర్లు
ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనలను పిటిషనర్లు పాడి కౌశిక్‌రెడ్డి, కేటీఆర్ తరఫు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు తీవ్రంగా ఆక్షేపించారు. ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కరణేనని ఆయన వాదించారు. ‘రెండు వారాల్లో తేల్చేస్తామని గతంలోనే కోర్టుకు హామీ ఇచ్చారు. కానీ మూడు నెలలైనా అతీగతీ లేదు. ఒక ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ నుంచి గెలిచి ఆ తర్వాత అధికార పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడేమో ఇంకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని చెబుతున్నారు.
ఇది పచ్చి మోసం. ఇది ఓపెన్ అండ్ షట్ కేస్. దీనికి విచారణ పేరుతో కాలయాపన చేయడం సరికాదు. ట్రిబ్యునల్ (స్పీకర్) ఈ రోజు వరకు కేసును కనీసం తాకలేదు’అని శేషాద్రి నాయుడు కోర్టు దష్టికి తెచ్చారు. స్పీకర్ కార్యాలయం కావాలనే జాప్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. రెండు వారాల్లో మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ కుమార్‌లకు సంబంధించి దాఖలైన అనర్హత పిటిషన్లపై తీసుకున్న చర్యలను తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే కనీసం నాలుగు వారాల గడువైనా ఇవ్వాలని స్పీకర్ తరఫు న్యాయవాదులు కోరగా రెండు వారాల్లో పురోగతి చూపిస్తే నాలుగు వారాల సమయం ఇస్తామని చెబుతూ విచారణను వాయిదా వేసింది.


