విదేశీ ప్రయాణాలు చేసేవారికి గమ్యస్థానానికి చేరుకున్నాక ఇమిగ్రేషన్ చెక్, ఇతరత్రా తనిఖీలు తెలియనిది కాదు..! కొన్ని సందర్భాల్లో ఈ తనిఖీల కోసమే చాంతాడంత క్యూలైన్‌లో గంటల తరబడి నిలబడాల్సి ఉంటుంది..! కానీ, ఇటీవల భారత్ అమల్లోకి తెచ్చిన ఈ-పాస్‌పోర్టు ఉన్నవారు మాత్రం ఇలాంటి క్యూలైన్లలో నిలబడకుండానే.. చాలా సులభంగా విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లే వెసులుబాటు ఉంటుంది.
ఈ-పాస్‌పోర్టు విదేశీ ప్రయాణికుల ప్రయాణాన్ని సులభతరం చేస్తోంది. కొత్త పాస్‌పోర్టు దరఖాస్తుదారులతోపాటు.. రెన్యూవల్ చేయించుకునేవారు కూడా ఇప్పుడు ఈ-పాస్‌పోర్టుకు జైకొడుతున్నారు. సాధారణ పాస్‌పోర్టుతో పోలిస్తే.. ఈ-పాస్‌పోర్టులో ఓ మైక్రోచిప్ ఉంటుంది. అందులో పాస్‌పోర్టుదారుడి వేలిముద్రలు, ఫొటోలు, ప్రయాణ వివరాలు.. ఇలా అన్నీ డిజిటల్‌గా రికార్డ్ అయ్యి ఉంటాయి.
అలాగని ఈ చిప్‌కు హ్యాకింగ్ బెడద ఉండదు. ఎందకంటే.. ఇది పూర్తిస్థాయిలో ఎన్‌క్రిప్ట్ అయ్యి ఉంటుంది. చూడ్డానికి సాధారణ పాస్‌పోర్టు మాదిరిగానే ఉన్నా.. పాస్‌పోర్టు కవర్‌పై చిన్న బంగారు చిహ్నంతో మైక్రోచిప్ ఉండడం ఈ-పాస్‌పోర్టు ప్రత్యేకం. మన దేశంలో 2024 ఏప్రిల్ నుంచి ఈ-పాస్‌పోర్టు జారీ ప్రారంభమైంది. ఇప్పటికే అమెరికా, కెనడా, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాతోపాటు.. 120 దేశాల్లో ఈ-పాస్‌పోర్టు విధానం అమల్లో ఉంది.
అసలు ఈ-పాస్‌పోర్టు ప్రత్యేకత ఏంటంటే.. పాస్‌పోర్టుదారుడు బయోమెట్రిక్ అందజేస్తే తప్ప.. ఇందులోని వివరాలు ఇమిగ్రేషన్ అధికారులు యాక్సెస్ చేయలేరు. ఇందులో బీఏసీ.. అంటే బేసిక్ యాక్సెస్ కంట్రోల్, పాసివ్ అథెంటికేషన్, ఎక్స్‌టెండెడ్ యాక్సెస్ కంట్రోల్ వంటి అనేక భద్రతా ఫీచర్లు ఉంటాయి. ఫలితంగా.. విమానాశ్రయాల్లో తనిఖీ సులభతరమవుతుంది. ఇమిగ్రేషన్, కస్టమ్స్, ఇతర తనిఖీ అధికారులు ఈ-పాస్‌పోర్టులోని సమాచారాన్ని అనుమానించే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే.. వ్యతిగత సమాచార తస్కరణ, వివరాల ట్యాంపరింగ్ ఇందులో అసాధ్యం కాబట్టి..! ఈ-పాస్‌పోర్టును ట్యాంపర్ చేయడం.. వివరాలను మార్చడం వంటి మోసాలు అంత సులభం కాదు. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఆమోదించిన ప్రమాణాల ప్రకారం ఈ-పాస్‌పోర్ట్‌లను భారత్ జారీ చేస్తోంది. అందుకే.. 120 దేశాలకు ఈ-పాస్‌పోర్టులను యాక్సెస్ చేసే వ్యవస్థ ఉంది. అంటే.. ఈ-పాస్‌పోర్టు ఉన్నవారు 120 దేశాల్లో ఎక్కడా కూడా తనిఖీల కోసం క్యూ కట్టాల్సిన అవసరం ఉండదు.
విదేశీ ప్రయాణాల్లో ఇమిగ్రేషన్ ప్రక్రియ చాలా మందికి శిరోభారాన్ని తెచ్చిపెడుతుంది. భారత్‌నుంచి బయలుదేరేప్పుడే ఐఎంఆర్సీ అవసరమా? కాదా? వెళ్లబోతున్న దేశంలో మాట్లాడే భాషపై అవగాహన ఉందా? ఇంగ్లిష్ ఎలా ఉంది? అనే వివరాలను తనిఖీ చేయడం తెలిసిందే..! ఈ-పాస్‌పోర్టు విషయంలో ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక ఈ-పాస్‌పోర్టు విధానం అమల్లో ఉండే గమ్యస్థాన దేశాన్ని చేరాక కూడా.. సాధారణ పాస్‌పోర్టుదారులకు భిన్నంగా సపరేట్ క్యూలైన్ ఉంటుంది. ఈ క్యూలో తనిఖీలు వేగంగా జరుగుతాయి. సాధారణ పాస్‌పోర్టుదారుల క్యూలో మాత్రం ఒకరి తనిఖీ పూర్తయ్యాకే.. మరొకరిని తనిఖీ చేస్తారు. అంటే.. ఈ-పాస్‌పోర్టు ఇప్పడు ఇమిగ్రేషన్ విధానాన్ని చాలా సులభతరం చేసిందన్నమాట..!


