ప్రకృతి సౌందర్యానికి అమెజాన్ అడవులు పెట్టింది పేరు..! అనకొండ వంటి ఎన్నెన్నో హాలీవుడ్ చిత్రాలకు ఈ అడవులు ఫేమస్..! చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర కథల పుస్తకాల్లో చదువుకునే చీమలు దూరని చిట్టడవి.. కాకులు దూరని కారడవి అమెజాన్‌కు సొంతం. అలాంటి అడవిలో ఎన్నెన్నో తెగలుంటాయి. ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి తెలియని ఓ కొత్త తెగ వివరాలు తాజాగా వెలుగు చూశాయి.
అమెజాన్ అడవులపై పరిశోధనలు జరుపుతున్న పర్యావరణవేత్త పాల్ రోసాలీ డ్రోన్ కెమెరాలతో దట్టమైన అటవీ ప్రాంతాలను.. సెలయేళ్లను.. కొండాకోనలను జల్లెడపడుతున్నారు. హెచ్‌డీ కెమెరాలకు ఇటీవల ఓ అరుదైన దృశ్యం చిక్కింది. దాంతో.. ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియని ఓ గిరిజన జాతి ప్రజల ఉనికి వెలుగులోకి వచ్చింది.
అంతే.. పాల్ రోసాలీ తన డ్రోన్ కెమెరాలతో ఆ తెగ ప్రజల జీవన శైలిని తెలుసుకునేందుకు చాలా రోజులు శ్రమించారు. ఫలితంగా.. ఆ తెగ సామాజిక పరిస్థితులు, సామూహిక వేడుకలు, అడవుల్లో లభించే చెట్ల నారతో.. చేత్తో తయారు చేసిన దుస్తులు.. ఇలా ఎన్నో విశేషాలను మన ముందు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఇంకా బయటపడని తెగలు 200 వరకు ఉంటాయని.. అమెజాన్‌లో తాజాగా వెలుగు చూసిన తెగ అందులో ఒకటని పాల్ రోసాలీ చెబుతున్నారు.
ఈ తెగ ఇప్పుడు అక్రమ మైనింగ్ కారణంగా అంతరించిపోయే ప్రమాదముందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గరింపెరోస్ పేరుతో బ్రెజిల్‌లో ఇలాంటి అక్రమ మైనింగ్‌లు సాధారణమే. ఈ మైనింగ్ వెనక శక్తిమంతమైన మాఫియాలున్నాయి. లూలా డా సిల్వా అధికారంలోకి వచ్చాక.. అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపేందుకు హెలికాప్టర్లతో పెట్రోలింగ్ జరుగుతున్నా.. గిరిజన జాతులకు ప్రమాదం ఏమాత్రం తగ్గలేదని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు.
వ్యవసాయం పేరుతో అడవులను నాశనం చేస్తున్నారని, సొయాబీన్, ఆయిల్‌పామ్ సాగు, పశువుల పెంపకం అమెజాన్‌లో విస్తృతమవుతోందని చెబుతున్నారు. ఇలాంటి పంటల కోసం అమెరికా, ఐరోపాలోని బడా బ్యాంకులు సైతం బిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చిస్తున్నాయని గుర్తుచేస్తున్నారు. ఈ సహజ సంపద దోపిడీ కారణంగా 2050 నాటికి అమెజాన్ అడవులు చాలా వరకు కుంచించుకుపోతాయనే ఆందోళనలు కూడా ఉన్నాయి.
తాజాగా కనుగొన్న తెగకు అక్రమ మైనింగ్‌తోపాటు.. మరో ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బాహ్య ప్రపంచ వ్యక్తులు వీరిని కలిస్తే.. ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. మనం తినే ఆహారంలో పురుగుమందు అవశేషాలుండడం తెలిసిందే..! ప్రకృతి ఒడిలో ఆర్గానిక్ ఫుడ్ తింటున్న ఈ తెగకు.. మన ఆహారాన్ని గనక ఇస్తే.. అది వారిపాలిట విషంలాంటిదే అంటున్నారు. ఇక బయటి వ్యక్తులు ఈ తెగను సంప్రదిస్తే.. ఇన్ఫ్లూయెంజా, మీజిల్స్ వంటి వ్యాధులు ప్రబలి, తెగ ఉనికికే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లో దూరంగా ఉండే తెగలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, సాధారణ జలుబు, వైరస్‌లు కూడా ఈ తెగ అంతానికి కారణమవ్వొచ్చని హెచ్చరిస్తున్నారు.



