బీసీ రిజర్వేషన్లు 28.18 శాతం | State govt decides to finalize BC reservations for local body elections | Sakshi
Sakshi News home page

బీసీ రిజర్వేషన్లు 28.18 శాతం

Oct 11 2026 4:43 AM | Updated on Oct 11 2026 4:43 AM

State govt decides to finalize BC reservations for local body elections

కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రులు 

అచ్చెన్నాయుడు, సత్యకుమార్, బాల శ్రీ వీరాంజనేయ స్వామి

సాక్షి, అమరావతి: రాజీవ్‌ రంజన్‌ మిశ్రా కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన శనివారం సచివాలయంలో జరిగిన కేబినెట్‌ సమావేశం ఈ మేరకు ఆమోదం తెలిపింది. యూనిట్‌ జనాభా ఆధారంగా కమిషన్‌ బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసిందని, దాని ప్రకారం రిజర్వేషన్లను కేబినెట్‌ ఆమోదించి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపిందని మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్, బాల శ్రీ వీరాంజనేయులు మీడియాకు వెల్లడించారు. ఇక బంతి తమ చేతిలో లేదని, ఎన్నికల సంఘం చేతిలో ఉందని మంత్రులు తెలిపారు. 

ఎన్నికల ముందు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పిస్తామని చెప్పామని, ఇందులో భాగంగా న్యాయ స్థానాలను ఆశ్రయించినా, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని చెప్పాయన్నారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని చెప్పారు. దీంతో రాజీవ్‌ రంజన్‌ మిశ్రా కమిషన్‌ నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పోగా, మిగతా రిజర్వేషన్లను 50 శాతం మించకుండా బీసీలకు కల్పించామని, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు రాని చోట పార్టీ పరంగా ఇస్తామని స్పష్టం చేశారు. 

యూనిట్లు ప్రాతిపదికగా రిజర్వేషన్లు
కమిషన్‌ సిఫార్సుల ప్రకారం స్థానిక సంస్థల స్వభావాన్ని బట్టి వేర్వేరు యూనిట్లను ప్రాతిపదికగా తీసుకొని రిజర్వేషన్లు నిర్ణయించినట్లు మంత్రులు తెలిపారు. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు గ్రామ పంచాయతీని, సర్పంచ్‌ పదవులకు మండల పరిధిలోని గ్రామ పంచాయతీలను, ఎంపీటీసీ పదవులకు సంబంధిత ప్రాంతీయ యూనిట్‌ను.. జెడ్పీటీసీ, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవులకు నిర్దేశిత జిల్లా లేదా రాష్ట్ర స్థాయి యూనిట్లను పరిగణనలోకి తీసుకున్నట్లు వివరించారు. పట్టణ స్థానిక సంస్థల్లో వార్డు సభ్యులు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, మేయర్లకు కూడా సంబంధిత యూనిట్ల ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు మంత్రి తెలిపారు.

స్థానిక సంస్థల వారీగా బీసీ రిజర్వేషన్లు
ప్రత్యేక కమిషన్‌ నివేదిక ప్రకారం బీసీలకు ప్రతిపాదించిన రిజర్వేషన్ల వివరాలను మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు 26.73 శాతం, గ్రామ పంచాయతీ సర్పంచులకు 27.95 శాతం, ఎంపీటీసీలకు 25.55 శాతం, ఎంపీపీలకు 24.60 శాతం, జెడ్పీటీసీలకు 24.60 శాతం, జిల్లా పరిషత్‌ చైర్మన్లకు 23.08 శాతం, పట్టణ స్థానిక సంస్థల వార్డు సభ్యులకు 32.78 శాతం, మున్సిపల్‌ చైర్‌పర్సన్లకు 33.02 శాతం, మేయర్లకు 35.29 శాతం రిజర్వేషన్లు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ గణాంకాల ప్రకారం స్థానిక సంస్థలన్నింటికీ కలిపి బీసీలకు సగటున 28.18 శాతం రిజర్వేషన్లు లభిస్తున్నాయని తెలిపారు. 

కొన్ని యూనిట్లలో తక్కువ శాతం కనిపించినప్పటికీ, ఆయా ప్రాంతాల్లోని జనాభా వివరాలు, కమిషన్‌ సిఫార్సులు, చట్టపరమైన పరిమితుల ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించినట్లు వివరించారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండేందుకు, 34 శాతం కంటే తక్కువ రిజర్వేషన్లు ఉన్న చోట్ల కూటమి భాగస్వామ్య పార్టీలు పార్టీ పరంగా 34 శాతానికి పైగా అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, ఎస్‌.సవిత, గుమ్మిడి సంధ్యారాణి, వంగలపూడి అనిత  పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement