
హన్‌కు తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు
రాజ్యాంగ న్యాయస్థానం సంచలన తీర్పు
సియోల్: దక్షిణ కొరియాలో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. దేశంలో మార్షల్ లాకు కారణమయ్యారనే ఆరోపణలపై ప్రధాని హన్ డక్–సూను అభిశంసిస్తూ పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేయడంతోపాటు ఆయనకు తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ తీర్పు వెలువరించింది.
గతేడాది డిసెంబర్‌లో అకస్మాత్తుగా దేశంలో మార్షల్ లా విధించి అభిశంసనకు గురైన అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ వ్యవహారంపై ఎటువంటి ఆదేశాలు ఇవ్వకపోవడం గమనార్హం. అయితే, మార్షల్ లా విధింపులో ఎలాంటి పాత్ర లేని హన్ విషయంలో రాజ్యాంగ కోర్టు 7–1 మెజారిటీతో వెలువరించిన తీర్పు ప్రభావం యూన్ విషయంలో ఉంటుందో లేదో ఇప్పుడే చెప్పడం కష్టమని పరిశీలకులు చెబుతున్నారు.