
న్యూఢిల్లీ: ఎట్టకేలకు గాంధీలు- బచ్చన్ల మధ్య వైరం ముగిసినట్లుంది. 2024 ఆగస్టులో కాంగ్రెస్ దిగ్గజ నేత సోనియా గాంధీ.. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్‌కు మద్దతుగా పార్లమెంటులో ఏదో అంశంపై వాకౌట్ చేయడంతో వారిద్దిరి మధ్య స్నేహం తిరిగి చిగురిస్తున్నదనే మాటలు వినిపించాయి. అయితే తాజాగా సోనియా గాంధీ, జయా బచ్చన్‌లు పక్కపక్కనే కూర్చుని కనిపించడంతో, వీరి మధ్య స్నేహం తిరిగి ఖాయమయ్యిదని స్పష్టమవుతోంది.
పక్కపక్కనే కూర్చుని..
కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే న్యూఢిల్లీలో ఇండియా అలయన్స్ నేతలకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందు ఇండియా కూటమి నేతల ఐక్యతను చాటిందనిపించేలా పలు దృశ్యాలు కనిపించాయి. ఈ విందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ ‘ఎక్స్’లో పంచుకుంది. రాజ్యాంగాన్ని నిలబెట్టడానికి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఈ సమావేశం దోహదపడుతుందని కాంగ్రెస్ పేర్కొంది. ఈ సందర్భంగా పార్టీ షేర్ చేసిన ఫొటోలలో సోనియా గాంధీ, జయా బచ్చన్ సంభాషించుకుంటూ కనిపించారు. దీనిని చూసినవారంతా గాంధీ, బచ్చన్ కుటుంబాల మధ్య వివాదాలు సమసిపోయాయంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
In the heart of New Delhi, Congress President Shri @kharge welcomed INDIA alliance leaders to an evening that was more than just dinner—it was a powerful reaffirmation of unity.
Bound by a shared commitment to uphold the Constitution and protect our democracy, the gathering… pic.twitter.com/h9FUTOIOi1— Congress (@INCIndia) August 11, 2025
సరోజినీ నాయుడు కలిపిన బంధం
గాంధీ-బచ్చన్ కుటుంబాల మధ్య స్నేహం ఎప్పటి నుంచో ఉంది. రాహుల్, ప్రియాంక గాంధీలు అమితాబ్ బచ్చన్‌ను మామ అని పిలుస్తుంటారట. అలహాబాద్‌లో ఈ రెండు కుటుంబాల మధ్య స్నేహం ఏర్పడిందని చెబుతుంటారు. ఆ నాడు నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన సరోజినీ నాయుడు ఆనంద్ భవన్‌లో కవి హరివంశ్ రాయ్ బచ్చన్, తేజీ బచ్చన్‌లను జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలకు పరిచయం చేశారు. దీంతో ఇరు కుటుంబాల స్నేహం మూడు తరాలుగా కొనసాగుతోంది. సోనియా గాంధీ పలు సందర్భాలలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకునేందుకు తనను బచ్చన్ల ఇంటిలో ఉండమని అత్త ఇందిరాగాంధీ చెప్పేవారిని తెలిపారు.
— Congress (@INCIndia) August 11, 2025
రాజీవ్ హత్యా సమయంలో..
రాజీవ్ గాంధీని వివాహం చేసుకునే ముందు సోనియా బచ్చన్ల ఇంట్లోనే ఉన్నారు. రాజకీయ,వ్యక్తిగత సంక్షోభ సమయాల్లో ఇరు కుటుంబాలు పరస్పరం అండగా నిలిచాయి. 1984లో ఇందిరా గాంధీ హత్య తర్వాత అమితాబ్ కాంగ్రెస్ అభ్యర్థిగా అలహాబాద్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురైనప్పుడు.. లండన్‌లో ఉన్న అమితాబ్, బోస్టన్‌లోని రాహుల్ గాంధీతో పాటు ఇండియాకు వచ్చి అంత్యక్రియల ఏర్పాట్లలో పాల్గొన్నారని చెబుతారు. కాగా బోఫోర్స్ కుంభకోణం సమయంలో గాంధీ, బచ్చన్ కుటుంబాల్లో విబేధాలు వచ్చాయనే వాదనలు వినిపిస్తుంటాయి.