
న్యూఢిల్లీ: గాజాలో జరుగుతున్న మారణహోమంపై ప్రధాని మోదీ పదిమందీ సిగ్గుపడేంత మౌనాన్ని ఎందుకు వహిస్తున్నారని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాని మోదీ భారతదేశ విలువలను నిలబెట్టుకోవాలని ఆమె సూచించారు.
రాజ్యాంగ విలువలకు ద్రోహం
గాజా విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి స్పష్టమైన వైఖరి లేకపోవడం అనేది మన రాజ్యాంగ విలువలకు ద్రోహం చేసినట్లే అవుతుందని సోనియా గాంధీ ప్రముఖ హిందీ వార్తాపత్రిక దైనిక్ జాగరణ్‌లో ప్రచురితమైన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న విధ్వంసకర దాడి విషయంలో ప్రధాని మోదీ మౌనం వహించడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆమె అన్నారు. గాజా ప్రజలకు అనుకూలంగా భారత్ స్పష్టమైన, ధైర్యమైన వైఖరిని ప్రకటించాలని సోనియా గాంధీ కోరారు. పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ సాగిస్తున్న సైనిక చర్యపై ప్రధాని మోదీ సిగ్గుపడే మౌనం అవలంభిస్తున్నారని ఆమె ఆరోపించారు.
పాలస్తీనాను భారత్ గుర్తించింది
ఇజ్రాయెల్ చర్యలను అనాగరికం, జాతిహత్యగా సోనియా అభివర్ణించారు. 1988లో పాలస్తీనా దేశాన్ని అధికారికంగా గుర్తించిన మెదటి దేశాలలో భారతదేశం ఒకటని ఆమె పేర్కొన్నారు. 2023, అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ జరిపిన దాడులను ఎవరూ సమర్దించలేదన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఇజ్రాయెల్ రెండేళ్ల దాడుల కారణంగా ఇప్పటివరకూ 17 వేల మంది చిన్నారులతో సహా, 55 వేలమంది హతమయ్యారని సోనియా గాందీ ఆవేదన వ్యక్తం చేశారు.
ట్రంప్ రియల్ ఎస్టేట్ కోసమే..
ప్రస్తుతం ఇజ్రాయెల్ రక్షణ దళాలు గాజాపై సైనిక దిగ్బంధనను విధించాయని, ఉద్దేశపూర్వకంగా అక్కడి జనాభాకు మందులు, ఆహారం, ఇంధన సరఫరాను అడ్డుకున్నాయని సోనియా గాంధీ ఆ వ్యాసంలో రాశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు వారి కుటుంబ వ్యాపారమైన రియల్ ఎస్టేట్ కోసం గాజాలో కొత్త నగరాన్ని నిర్మించాలని యోచిస్తున్నారని సోనియా ఆరోపించారు. అయితే ఇజ్రాయెల్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం ముందుకు తీసుకెళ్లడంలో దక్షిణాఫ్రికా ధైర్యమైన అడుగు వేసిందని సోనియా పేర్కొన్నారు. ఫ్రాన్స్.. పాలస్తీనా దేశాన్ని గుర్తించిందని, బ్రిటన్, కెనడా తదితర దేశాలు ఇజ్రాయెల్ నేతలపై ఆంక్షలు విధించాయని సోనియా పేర్కొన్నారు.
జాతీయ మనస్సాక్షికి మాయని మచ్చ
భారతదేశం ప్రపంచ న్యాయానికి చిహ్నంగా నిలిచిందని, వలసవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ ఉద్యమాలకు ప్రేరణ కల్పించిందని, దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా అంతర్జాతీయ పోరాటానికి నాయకత్వం వహించిందని సోనియా గుర్తు చేశారు. అమాయక ప్రజలను క్రూరంగా వధిస్తున్న సమయంలో.. భారతదేశం తన విలువలను వదులుకోవడం మన జాతీయ మనస్సాక్షికి మాయని మచ్చ.. మన రాజ్యాంగ విలువలకు చేసే ద్రోహం అని సోనియా పేర్కొన్నారు. సోనియా కుమార్తె, లోక్‌సభ సభ్యురాలు ప్రియాంక గాంధీ గాజాలో శాంతికి గట్టిగా మద్దతు పలికారు.