ప్రపంచ భద్రతా సమీకరణాల్లో మరోసారి దక్షిణాసియా కేంద్రంగా చర్చ మొదలైంది. అణు శక్తి, ఆయుధ సామర్థ్యం, పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతల మధ్య.. భారత్ తన అణు సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ పోతోంది. ఈ క్రమంలో.. పాకిస్థాన్‌పై ఆధిక్యం సాధించిందని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) తాజా నివేదిక వెల్లడించింది.
సిప్రి ఇయర్‌బుక్ 2026 ప్రకారం.. భారత్ వద్ద ప్రస్తుతం సుమారు 190 అణు వార్‌హెడ్స్ ఉండగా, పాకిస్థాన్ వద్ద సుమారు 170 మాత్రమే ఉన్నాయని అంచనా వేసింది. ఇరు దేశాలు 2025లో కూడా తమ అణు ఆయుధ వ్యవస్థలను ఆధునీకరించడంపై దృష్టి పెట్టాయని.. ముఖ్యంగా భారత్ తన దీర్ఘశ్రేణి అణు సామర్థ్యాన్ని పెంచుకుంటూ చైనా వరకు చేరగలిగే డెలివరీ సిస్టమ్స్ అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు నివేదిక పేర్కొంది. అదే సమయంలో పాకిస్థాన్ కూడా ఫిషైల్ మెటీరియల్ సేకరణ, కొత్త డెలివరీ సిస్టమ్స్ అభివృద్ధిని కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
ఆపరేషన్ సిందూర్ టైంలో..
2025 మే నెలలో భారత్–పాక్ మధ్య చోటుచేసుకున్న సైనిక ఉద్రిక్తతను సిప్రి “అసాధారణంగా తీవ్రమైన మిలిటరీ క్రైసిస్”గా అభివర్ణించింది. అయితే అణు ఘర్షణ దిశగా వెళ్లకుండా ఇరు దేశాలు నియంత్రణ పాటించినట్లు నివేదిక స్పష్టం చేసింది. అయినప్పటికీ భవిష్యత్తులో ప్రమాదాలు పెరుగుతున్నాయని హెచ్చరించింది.
ప్రపంచ స్థాయిలో చూస్తే మొత్తం 9 అణు దేశాల వద్ద కలిపి సుమారు 12,241 వార్‌హెడ్స్ ఉన్నాయని సిప్రి తెలిపింది. వీటిలో అత్యధికంగా అమెరికా, రష్యా వద్దే అధిక భాగం ఉండగా, చైనా వేగంగా తన అణు సామర్థ్యాన్ని విస్తరిస్తోందని నివేదిక పేర్కొంది. చైనా వద్ద ఇప్పటికే సుమారు 620 వార్‌హెడ్స్ ఉన్నాయని అంచనా. భారత్ విషయానికి వస్తే..
కొత్త తరహా అణు ఆయుధ వ్యవస్థలు, దీర్ఘశ్రేణి క్షిపణులు అభివృద్ధి చేయడం ద్వారా తన వ్యూహాత్మక స్థాయిని పెంచుకుంటోందని సిప్రి స్పష్టం చేసింది. పాకిస్థాన్ కూడా తన అణు శక్తిని విస్తరించే ప్రయత్నాల్లో ఉందని, వచ్చే దశాబ్దంలో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
డేంజర్ జోన్ ఎందుకంటే..
సిప్రి నివేదికలో మరో కీలక అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అణు ఆయుధాలపై ఆధారపడే ధోరణి పెరుగుతోందని, డిసార్మ్‌మెంట్ ప్రయత్నాలు బలహీనపడుతున్నాయని స్పష్టం చేసింది. దేశాలు రక్షణ పేరుతో అణు ఆయుధాల వైపు మరింత మొగ్గు చూపుతున్నాయని, ఇది ప్రమాదకర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అణు ఆయుధాలపై పారదర్శకత తగ్గడం, దేశాల మధ్య చర్చలు–ఒప్పందాలు బలహీనపడటం, రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం వల్ల.. భవిష్యత్తులో విపరీతాలు జరగొచ్చని సిప్రి నిపుణులు ఆందోళన చెందుతున్నారు. అవతలి దేశం దాడి చేయబోతుందనుకుని ఇవతలి దేశం పొరపడడం, చిన్న సంఘటనను పెద్ద ముప్పుగా భావించడం, అవసరం లేని సమయంలో సైనిక చర్యలకు వెళ్లడం లాంటివి జరిగే అవకాశం ఎక్కువగా జరగొచ్చని అంటున్నారు. పెద్ద దేశాల మధ్య చిన్న పొరపాటు కూడా పెద్ద యుద్ధ ప్రమాదంగా మారే అవకాశం ఉందంటూ గతంలో భారత్–పాక్ మధ్య గతంలో చోటు చేసుకున్న సైనిక ఘర్షణలను ప్రస్తావిస్తున్నారు.


