ఏడు జన్మలోనూ నువ్వే తోడుగా.. హనీమూన్‌ కపుల్‌ కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌ | Shocking Twist In Meghalaya Honeymoon couple missing Case | Sakshi
Sakshi News home page

ఏడు జన్మలోనూ నువ్వే తోడుగా.. హనీమూన్‌ కపుల్‌ కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌

Jun 10 2025 8:15 PM | Updated on Jun 11 2025 9:09 AM

Shocking Twist In Meghalaya Honeymoon couple missing Case

మేఘాలయలో హనీమూన్‌ జంట మిస్సింగ్‌ కేసులో విచారణ లోతుల్లోకి వెళ్లే కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగు చేస్తున్నాయి. వధువు సోనమే ఓ పథకం ప్రకారం తన భర్త రాజా రఘువంశీని హత్య చేయించిందన్న విషయం ప్రాథమికంగా వెల్లడైంది. అయితే ఇందుకుగానూ కిరాయి హంతకులకు ఆమె తొలుత చెప్పిన కంటే రెట్టింపు సొమ్ము ఆఫర్ చేసిందని పలు ఆంగ్ల మీడియా ఛానెల్స్‌‌ కథనాలు ఇస్తున్నాయి. అదే సమయంలో..

తన ఇష్టానికి వ్యతిరేకంగా పెద్దలు రాజాతో పెళ్లి జరిపించారని, అతనితో శారీరకంగా కలవడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదంటూ ప్రియుడు రాజ్‌ కుష్వాహాతో జరిపిన చాటింగ్‌ను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. ‘‘రాజా అంటే నాకు ఇష్టం లేదు. అతనితో వివాహం నిశ్చయమైనప్పటి నుంచే దూరంగానే ఉంటున్నా. పెళ్లయ్యాక కూడా అతనితో శారీరకంగా కలవలేకపోతున్నా’’ అంటూ ఆమె రాజ్‌తో చాటింగ్‌ చేసినట్లు అందులో ఉంది. ఇక.. 

👉భర్తను కిరాతకంగా హత్య చేయించి.. ఆ మృతదేహాన్నిలోయలో పడేయించిన ఆమె ఆపై కొత్త డ్రామా ఆడింది. రాజా ఫోన్‌ నుంచి ఏడు జన్మలోనూ నువ్వే నా తోడుగా.. అంటూ క్యాప్షన్‌ వాట్సాప్‌  స్టేటస్‌గా ఉంచింది. మే 23వ తేదీన రాజా హత్య జరగ్గా.. కొన్ని గంటల తర్వాత ఆమె ఆ స్టేటస్‌ ఉంచింది. తద్వారా రాజా బతికే ఉన్నాడని అతని కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసింది.

👉పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజా రఘువంశీని హత్య చేసేందుకు తొలుత కిరాయి హంతకులకు సోనమ్ రూ.4లక్షలు ఇవ్వజూపింది. కానీ, తర్వాత ఆ మొత్తాన్ని రూ.20లక్షలకు పెంచిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అలాగే తన భర్త మృతదేహాన్ని లోయలో విసిరేసేందుకు నిందితులకు ఆమె సహకరించిందని పేర్కొన్నాయి. 

👉మే 11న రాజా రఘువంశీతో సోనమ్‌కి వివాహం జరగ్గా.. 20న హనీమూన్‌ (Honeymoon) కోసం ఈ నవ దంపతులు మేఘాలయకు వెళ్లారు. మే 23 నుంచి వారు ఉంటున్న బస నుంచి ఓ స్కూటీపై బయటకు వెళ్లి.. ఆచూకీ లేకుండా పోయారు. ఆ బండి ఓ గ్రామ శివారులో లభ్యమైంది. అయితే.. అదృశ్యమైన 11 రోజుల తర్వాత(జూన్‌ 2వ తేదీన) రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానించారు. సోనమ్‌ ఆచూకీ లభ్యం కాకపోవడంతో అంతా కంగారు పడ్డారు. ఈలోపు ఆమె కోసం ప్రత్యేక బలగాలతో అడవిలో గాలింపును ముమ్మరం చేసి.. మరోవైపు కేసు దర్యాప్తు వేగం పెంచారు పోలీసులు. 

👉అంతా సోనమ్‌, కుశ్వాహా ప్లాన్ ప్రకారమే జరిగింది. అయితే హత్యకు వారు ఉపయోగించిన పదునైన ఆయుధంతో అంతా తారుమారు చేసింది. రఘువంశీ హత్య కేసు విచారణ సమయంలో సోనమ్‌ బ్రతికే ఉందని గుర్తించాం. దీంతో ఆమె ఈ హత్య చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమయ్యాయి. సాధారణంగా.. ఇలాంటి ఆయుధాన్ని మేఘాలయలో ఉపయోగించరు. దాంతో బయటివ్యక్తి ప్రమేయం ఉందని మాకు అనుమానం వచ్చింది. తర్వాత మేం కాల్ రికార్డులను పరిశీలించాం. అందులో రాజ్‌ కుష్వాహతో ఆమె రెగ్యులర్‌గా టచ్‌లో ఉంది. సోనమ్‌ చివరిసారిగా రాజా తల్లితో మాట్లాడిన మాటలు మాకు అనుమానం కలిగించాయి. అలాగే ఆమె ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలేవీ స్టేటస్‌లు పెట్టకపోవడంతో ఆ అనుమానాలు బలపడ్డాయి’’ అని పోలీసు అధికారి వెల్లడించారు.

👉ఈ కేసులో మరో కీలక విషయం బయటకు వచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రాజ్‌ కుష్వాహ మృతుడు రాజా రఘువంశీ అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నాడు. ఈ వీడియోను మృతుడి సోదరి ఒకరు ఎక్స్‌లో పోస్టు చేశారు. రఘువంశీ మృతదేహం దొరికిన తర్వాత దాన్ని ఇందౌర్‌కు తరలించేందుకు తాము నాలుగు వాహనాలను ఏర్పాటుచేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అందులో ఒక దాన్ని నిందితుడు రాజ్‌ కుష్వాహ నడిపాడని వారు వివరించారు. సోనమ్‌ తండ్రిని కూడా అతడు ఓదార్చినట్లు పేర్కొన్నారు. అరెస్టు తర్వాతనే అతడి గురించి తమకు తెలిసిందన్నారు. ఈ హత్యలో తన ప్రమేయం ఉందనే విషయం బయటపడకుండా ఉండేందుకే కుశ్వాహా అలా నటించినట్లు తెలుస్తోంది.

👉తన తండ్రి కంపెనీలో పని చేసే రాజ్‌ కుష్వాహతో సోనమ్‌ ప్రేమలో ఉంది. అయితే పెద్దలకు ఆ విషయం చెప్పే ధైర్యం లేక రాజా రఘువంశీని పెళ్లి చేసుకుంది. సోనమ్‌, కుశ్వాహాలు కలిసే రఘువంశీ హత్యకు ప్రణాళిక రచించారు.  దాన్ని అమలుచేసేందుకు సోనమ్‌, కుశ్వాహాలు కొంతమంది కిరాయి రౌడీలను ఏర్పాటుచేసుకొన్నారు. ఈ క్రమంలోనే కుశ్వాహా మేఘాలయకు వెళ్లకుండా సోనమ్‌తో ఫోన్‌లో టచ్‌లో ఉండి.. తమ ప్రణాళిక అమలయ్యేలా చేశాడు. పథకం ప్రకారం రఘువంశీని సోనమ్‌ చిరపుంజీలో జనసంచారం లేని మార్గం వైపు తీసుకెళ్లింది. అక్కడ కిరాయి రౌడీలు అతడిని హతమార్చారు. అనంతరం సోనమ్‌తో సహా ముగ్గురు నిందితులు అస్సాంలోని గువాహటికి వెళ్లారు. అక్కడి నుంచి ఎవరికి వారు విడిపోయారు. 

అయితే పోలీసుల వద్దకు రఘువంశీని తాను చంపించలేదని, తననే ఎవరో అపహరించారని సోనమ్‌ చెప్పడం గమనార్హం. కేసులో అరెస్టయిన రాజ్‌ కుశ్వాహాతో సోనమ్‌కు సాన్నిహిత్యం ఉందని వెల్లడైంది. అతడే ఈ హత్య ప్లాన్‌ను నడిపించాడని పోలీసులు వర్గాలు తెలిపాయి. మరోవైపు.. ఇండోర్‌కు చెందిన విశాల్‌సింగ్‌ చౌహాన్‌ (22), రాజ్‌సింగ్‌ కుశ్వాహా (21), ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్‌పుర్‌కు చెందిన ఆకాశ్‌ రాజ్‌పూత్‌ (19)ను ఈ కేసులో అరెస్టు చేశారు.  మరోవైపు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం నిందితులందరినీ పోలీసులు మేఘాలయాకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఆమెను విమానంలో తీసుకెళ్తున్న దృశ్యాలు నెట్టింట​ వైరల్‌ అవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement