
కర్ణాటక: విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్న భర్త ఇంటికి మొదటి భార్య నిప్పంటించింది. ఈ విడ్డూరం దొడ్డ పట్టణ పరిధిలోని కొంగాడియప్ప కళాశాల వెనుక ఇంట్లో చోటుచేసుకుంది. వివరాలు.. స్థానికుడు గౌతమ్ అనే వ్యక్తి కలహాల కారణంగా భార్యతో విడిపోయాడు. ఇద్దరూ కోర్టులో విడాకుల కేసు వేసుకున్నారు.
కేసు నడుస్తున్న క్రమంలో గౌతం రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన మొదటి భార్య వచ్చి, విడాకులు కాకుండానే ఎలా పెళ్లి చేసుకున్నావని అతనితో గొడవపడింది. ఇరువైపుల వారు మాట్లాడుతుండగా ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆగ్రహం పట్టలేని మొదటి భార్య ఇంటికి నిప్పంటించినట్టు అనుమానాలున్నాయి. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.